సుష్మ సాయం చేశారా? లేదా?
సుష్మ రాజీనామా చేయాల్సిందే..
న్యూఢిల్లీ : లలిత్ మోదీ వ్యవహారంపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరు కావాలని కోరుతున్నామని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రేడియోలోనూ, టీవీలోనూ, పత్రికల్లోనూ కాదని, సభలో ప్రధాని మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం లోక్ సభలో లలిత్ మోదీ అంశంపై చర్చ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ మోదీ సభా నాయకుడు, చర్యలు తీసుకోవాల్సింది ఆయనే, అందుకే ప్రధాని చర్చ సమయంలో ఉండాలని కోరుతున్నామన్నారు.
సుష్మా స్వరాజ్ వ్యక్తిగతంగా లలిత్ మోదీకి సాయం చేశారని, అతని భార్యను కాపాడటానికి మోదీకి ఎలా సాయం చేస్తారని ఖర్గే ప్రశ్నలు సంధించారు. సుష్మ చట్టాన్ని ధిక్కరించారని అన్నారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మంచి న్యాయవాది, చక్కటి ఫీజు కూడా తీసుకుంటారని, మానవతా దృక్పథంపైన చట్టాన్ని ఉల్లంఘించి సుష్మ వ్యవహరించడం సమంజసమా? కాదా అనేది జైట్లీ చెప్పాలన్నారు.
ఆర్థిక శాఖకు, రాయబారికి, విదేశాంగ శాఖ కార్యదర్శికి ఎవ్వరికీ చెప్పకుండా సుష్మ ఎలా సహాయం చేస్తారు, దీనికి సంబంధించి ఎలాంటి ప్రత్యుత్తరాలు జరపకుండా ఎలా బ్రిటన్కు అభ్యంతరం లేదని చెబుతారని ఖర్గే ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి సంబంధించిన ఫైల్స్లో ఎలాంటి పత్రాలైనా ఉన్నాయా అని ఆయన వ్యాఖ్యానించారు. నైతిక బాధ్యత వహిస్తూ సుష్మా స్వరాజ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.