మోదీపై రాహుల్ ఆరోపణల్లో నిజమెంత?
న్యూఢిల్లీ: సహారా, ఆదిత్య బిర్లా కార్పొరేట్ సంస్థల నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 52 కోట్ల రూపాయల ముడుపులు పుచ్చుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. మోదీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన సమాచారం తన వద్దనుందని, దాన్ని వెల్లడిస్తే భూకంపం పుడుతుందని ఊదరగొట్టిన రాహుల్ చివరకు ఊదింది కొత్త విషయమేమీ కాదు. నెల రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేసిన ఆరోపణలే. మరింత లోతుగా చెప్పాలంటే ‘కామన్ కాజ్’ స్వచ్ఛంద సంస్థ తరఫున లాయర్ ప్రశాంత్ భూషణ్ వేసిన పిటీషన్‌లోని అంశాలే.
సహారా, ఆదిత్య బిర్లా కార్పొరేట్ సంస్థల కార్యాలయాలపై 2013, 2014లలో ఐటీ, సీబీఐ అధికారులు జరిపిన దాడుల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. వాటి కార్యాలయాల నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్లలో వివిధ రాజకీయ పార్టీలకు, నాయకులకు ఇచ్చిన ముడుపుల వివరాలు ఉన్నాయి. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి 40 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు సహారా కంప్యూటర్ రికార్డుల్లో, 25 కోట్లకు గాను 12 కోట్లు ఇచ్చామని, మిగతా సొమ్మును ఇవ్వాల్సి ఉందని ఆదిత్య బిర్లా కంపెనీ ల్యాప్‌ట్యాప్‌లో (2012, నవంబర్ 16వ తేదీతో) నమోదు చేసి ఉంది. మరో చోట మోదీకి మిగతా సొమ్మును కూడా ముట్టచెప్పినట్లు నమోదై వుంది. ఓ చోట గుజరాత్ సీఎం, అని మరో చోట నేరుగా ‘మోదీ’ అని పేర్కొని వుంది.
ఆదిత్య బిర్లా అధికారులను సీబీఐ అధికారులు విచారించినప్పుడు ‘గుజరాత్ సీఎం’ అంటే ఎవరని ప్రశ్నించగా, గుజరాత్ సీఎం కెమికల్స్ అని బిర్లా అధికారులు సమాధానం ఇవ్వడం గమనార్హం. ఆ తర్వాత నేరుగా మోదీ పేరే ఉండడంపై వారు ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం వచ్చిందో బయటకు తెలియదు. ఆ దిశగా కేసు విచారణ కూడా ముందుకు కొనసాగలేదు.
అసలు రాజకీయమంతా ఇక్కడే ఉంది. ఆదిత్య బిర్లా కంపెనీ నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌ట్యాప్‌లో మోదీ పేరుతోపాటు కాంగ్రెస్ పార్టీ, తణమూల్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ తదితర ప్ర«ధాన పార్టీల పేర్లన్నీ ఉన్నాయి. అందుకనే కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలేవీ కూడా మోదీ ముడుపుల గురించి ఇంతవరకు మాట్లాడలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరు లేకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే మోదీపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి మాట్లాడుతూ వచ్చారు.
ఇలాంటి ఆరోపణలు లేదా కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఆధారాలు ఎలాగూ కోర్టుల ముందు నిలబడవు. పైగా వ్యక్తిగతంగా తన పేరు ఎలాగు లేదు కనుక మోదీపై వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడితే తనకు పోయేదేమీ లేదని రాహుల్ గాంధీ భావించి ఉంటారు. అందుకే ఊరించి, ఊరించి ఉడికించే ఆరోపణలు చేశారు. వాటిని మోదీ తనదైన శైలిలో తిప్పికొడుతున్నారు.
ఏదేమైనా రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థల కుమ్మక్కుకు సంబంధించిన అవినీతి ఆరోపణలంటే మామాలు విషయం కాదు. వీటిని ప్రజల దష్టిలో కచ్చితంగా విచారించాల్సిందే. నిజా నిజాలేమిటో ప్రజలకు తెలియాల్సిందే. అందు కోసం పోరాడుతున్న కామన్ కాజ్ లాంట్ సంస్థల తరఫున నిలబడాల్సిందే. ఇలాంటి అవినీతి ఆరోపణలను పరిగణలోకి తీసుకోలేమని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు ఇప్పటికే వ్యాఖ్యానించినప్పటికీ దర్యాప్తు కోసం వత్తిడి తీసుకరావడానికి మరో అవకాశం ఇంకా ఉంది. 2017, జనవరి 11వ తేదీన భూషణ్ పిటీషన్‌పై సుప్రీం కోర్టులో తదుపరి విచారణ జరగాల్సి ఉంది. రాహుల్ గాంధీకి దమ్ముంటే ఆ పిటీషన్‌లో ఇంప్లీడ్ కావాలి. ––––––ఓ సెక్యులరిస్ట్ కామెంట్