పథకాలన్నీ పేదల కోసమే
- మనది పేదలు, రైతు సంక్షేమ సర్కారు
- బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ పేదల కోసమేనని, తమది పేద లు, రైతు అనుకూల సర్కారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన ఆదివారమిక్కడ బీజేపీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. పేదలు, రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మోదీ వివరించారు. బీజేపీని విమర్శిస్తున్న విపక్షాలపై ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వానికి, గత సర్కారుకు మధ్య బ్లాక్ అండ్ వైట్ టీవీకి, కలర్ టీవీకి ఉన్నంత తేడా ఉందని, ఈ విషయాన్ని ప్రజలకు తెలపాలని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాలు ఎంత బురదజల్లినా ప్రజలకు ఎప్పటికప్పుడు నిజాలు తెలియజేయాలని, అప్పుడు వారే మనల్ని మెచ్చుకుంటారని అరు.
మరుగుదొడ్ల నిర్మాణం, పెన్షన్లు, రైతులకు పరిహారం చెల్లించేందుకు వీలుగా పంట నష్టం శాతాన్ని తగ్గించడం, దళితులు, మైనారిటీల సంక్షేమం వంటి పలు పథకాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమాలతో పేదలకే మేలు జరుగుతుందని, ధనికులకు వీటితో సంబంధమేంటని ప్రశ్నించారు. తాను సర్వదా పేదల సంక్షేమం కోసమే పనిచేస్తున్నానని, వార్తల్లోకెక్కడానికి కాదన్నారు. తమ పథకాలు, విధానాలను రాజకీయ కోణంలో కాకుండా జాతి ప్రయోజనాల కోణంలో చూడాలని విపక్షాలకు హితవు పలికారు.
వీకే సింగ్‌కు సెల్యూట్.. యెమెన్‌లో సంక్షోభం నేపథ్యంలో అక్కడి భారతీయులను 24 గంటల్లోనే స్వదేశానికి తీసుకొచ్చామని, ఈ విషయంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఎంతో కృషి చేశారని మోదీ తెలిపారు. ఓరకంగా ఆయన సైనికుడిలా యుద్ధ భూమిలో పోరాడారని, అందుకు సెల్యూట్ చేస్తున్నానని కొనియాడారు. బహుశా ప్రపంచంలోనే ఇలాచేసిన మంత్రి ఎవరూ లేరన్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా చాలా కష్టపడుతున్నారని, గతంలో ఎవరూ ఆమెలా పనిచేయలేదన్నారు.