‘ఆ పడవను మనమే పేల్చేశాం’
*కేంద్రంపై ‘పాక్ బోట్ పేల్చివేత’ వివాదం
*కోస్ట్‌గార్డ్ డీఐజీ ప్రకటనపై ఇరకాటంలో కేంద్రం
*అందులోని దుండగులే ఆ బోట్‌ను పేల్చేశారని
*అప్పుడు ప్రకటించిన రక్షణ శాఖ డీఐజీ వ్యాఖ్యలపై విచారణకు రక్షణ శాఖ ఆదేశం
*భారత్ అమానుషంగా ప్రవర్తించిందన్న పాక్
అహ్మదాబాద్/బెంగళూరు: డిసెంబర్ 31 అర్ధరాత్రి దాటిన తరువాత అరేబియా సముద్ర జలాల్లో పాకిస్తాన్ వైపు నుంచి అనుమానాస్పదంగా దూసుకొచ్చి.. భారత తీర రక్షక దళం గుర్తించి, వెంటాడటంతో వెనక్కు పారిపోతూ పేలిపోయిన బోట్ ఉదంతం గుర్తుందా? ఆ ఘటనను దాదాపు అంతా మర్చిపోతున్న సమయంలో ఒక వివాదంలా అది మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. పోరుబందరు తీరానికి 365 కి.మీ.ల దూరంలో ఆ బోట్‌ను అందులో ఉన్న నలుగురు దుండగులే పేల్చేశారన్న నాటి రక్షణ శాఖ, తీర రక్షక దళ ప్రకటనలకు విరుద్ధంగా.. ఆ బోట్‌ను పేల్చేయాలని భారత తీర రక్షక దళాన్ని తానే ఆదేశించానంటూ మంగళవారం కోస్ట్‌గార్డ్ డీఐజీ(నార్త్‌వెస్ట్ రీజియన్ స్టాఫ్ చీఫ్) బీకే లొశాలి చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టించింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఒక కార్యక్రమంలో లొశాలి మాట్లాడుతూ.. ‘ఆ పాక్ బోట్‌ను మనమే పేల్చేశాం. అప్పుడు నేను గాంధీనగర్‌లో ఉన్నా. ఆ బోట్‌ను పేల్చేయమని నేనే ఆదేశించా. వారిని పట్టుకుని వారికి బిర్యానీలు వడ్డిస్తూ కూర్చోలేం’ అని వ్యాఖ్యానించారు. దీనిపై రక్షణ శాఖ తీవ్రంగా స్పందించింది. వివరణ ఇవ్వాలంటూ బుధవారం లొశాలికి షోకాజ్ నోటీసును జారీ చేసింది. లొశాలి వాస్తవ విరుద్ధ ప్రకటన ఇచ్చి ఉంటే క్రమశిక్షణ చర్యలుంటాయని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. బెంగళూరులో ఏయిర్ షోలో పాల్గొన్న సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఆ బోట్‌ను అందులోని వారే పేల్చేసుకున్నారన్న తమ గత ప్రకటనకే కట్టుబడి ఉన్నామన్నారు. లొశాలి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తెప్పించుకుని చూస్తానని, పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలుంటాయని వివరించారు.
ఈ నేపథ్యంలో లొశాలి బుధవారం మాట మార్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆ ఆపరేషన్‌కు తనకు అసలు సంబంధమే లేదని వివరణ ఇచ్చారు. పాకిస్తాన్ బోట్‌కు సంబంధించిన ఆపరేషన్‌కు తన బాస్ ఐజీ కుల్దీప్ సింగ్ ఇన్‌చార్జిగా ఉన్నారన్నారు. ఈ ఉదంతాన్ని అవకాశం గా తీసుకున్న పాకిస్తాన్ భారత్‌పై విమర్శలు గుప్పించింది. భారత తీరరక్షక దళ డీఐజీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. భారత్ అత్యంత క్రూరంగా వ్యవహరించిందని పేర్కొంది. బోట్‌ను పేల్చేయడం ద్వార సంరతా ఎక్స్‌ప్రెస్ కేసు తరహాలో తప్పుడు, నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా.. బోట్లో ప్రయాణిస్తున్న నలుగురు అమాయకుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తింది. తద్వారా భారత్ మరోసారి అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించిందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ విమర్శించారు.
మరోవైపు, భారత్‌లోనూ విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఈ విషయంలో వాస్తవాన్ని వెల్లడించాలని, డీఐజీపై బెదిరింపులకు దిగకూడదని కాంగ్రెస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ‘ఆ బోట్‌ను పేల్చేసి, ప్రజలకు అబద్ధాలు చెప్పడం కన్నా పాపం వేరే ఉంటుందా? నిజంగా ఆ బోట్లోని వారు ఉగ్రవాదులే అయితే, బోట్‌ను పేల్చేశామని చెప్పుకోవడానికి సిగ్గుపడటమెం దుకు?’ అని పార్టీ నేత మనీశ్ తివారీ ట్వీట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఈ ఉదంతం రుజువు చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. భారత్‌లో ముంబై తరహా దాడులకు మరోసారి పాల్పడేందుకే ఆయుధాలతో ఆ బోట్ మనవైపునకు వచ్చిందన్న వార్తలు అప్పుడు వచ్చాయి.