కెప్టెన్ వస్తే మంచిదే!
పంజాబీల మనోగతం
లుధియానా: పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు సానుకూల పవనాలు వీస్తున్నట్లు తెలుస్తోంది. పదేళ్ల అకాలీ–బీజేపీ పాలనతో విసిగిపోయామని, మార్పు కోరుకుంటున్నామని పలువురు ఓటర్లు చెబుతున్నారు. లుధియానాలోని గిల్‌మార్గ్ ప్రాంతంలో కాకా హోటల్ నడుపుతున్న ప్రత్మల్ సింగ్(45) అనే వ్యాపారి మాట్లాడుతూ.. తాను మార్పు కోరుకుంటున్నానని ముక్తకంఠంతో చెప్పాడు. ‘ఇది పనికిమాలిన ప్రభుత్వం. మార్పు రావాలి. కెప్టెన్ (కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అమరీందర్) వస్తే మంచిది. నోట్ల రద్దుతో నా వ్యాపారం పడిపోయింది. రెండు వేల నోటుకు చిల్లర ఎక్కడి నుంచి తెచ్చేది?’’ అని అన్నాడు.
అకాలీకి గట్టి మద్దతుదారైన ప్రత్మల్ కాంగ్రెస్‌కు ఎన్నడూ ఓటేయలేదు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత అతన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే మారిన పరిస్థితుల్లో అకాలీలు ఓడిపోవాలని కోరుకుంటున్నాడు. కాంగ్రెస్ సొంతంగా, లేకపోతే ఆప్ మద్దతుతో అధికారంలోకి వచ్చినా ఫర్వాలేదని చెప్పాడు. ‘సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ స్వార్థపరుడిగా మారాడు. అన్ని వ్యాపారాలూ ఆయన బంధుమిత్రులవే. రవాణా వ్యాపారమంతా అకాలీ నేతలదే. డ్రగ్స్ వ్యాపారులకు అకాలీ–బీజేపీ సర్కారు అండ ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. వ్యవసాయం దెబ్బతింది. నిరుద్యోగులు మత్తుపదార్థాలు తీసుకుంటున్నారు’ అని ఆందోళనవ్యక్తం చేశారు. అమరీందర్ సమర్థుడు, అనుభవజ్ఞుడని, ఆయన మాత్రమే పంజాబ్‌కు పూర్వవైభవం తేగలరని అన్నాడు.