సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఉద్యోగాల కొరతపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చురకలు వేశారు. ఉద్యోగాలు ఎక్కడున్నాయంటూ నితిన్ గడ్కరీ ప్రశ్నించడాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ ప్రతి భారతీయుడు అడుగుతున్న ప్రశ్ననే మీరు లేవనెత్తారు..అద్భుతం గడ్కరీజీ అంటూ ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు కనుమరుగవుతున్న క్రమంలో రిజర్వేషన్ల వల్ల ఉపయోగం ఏముందని గడ్కరీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
రిజర్వేషన్లు వర్తింపచేశామని అనుకున్నా బ్యాంకింగ్, ఐటీ ఇలా ఏ రంగంలోనూ ఉద్యోగాలు లేవు..ప్రభుత్వ నియామకాలు స్తంభించిపోయాయి..అసలు ఉద్యోగాలు ఎక్కడున్నాయ్ అని గడ్కరీ అన్నారు. కోటా కోసం మరాఠాలు సాగిస్తున్న ఆందోళనల నేపథ్యంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం వెనకబడిన వర్గాలకు కోటా డిమాండ్‌ను తెరపైకి తేవడం దురదృష్టకరమన్నారు. బిహార్, యూపీలో రాజకీయ ప్రాబల్యం కలిగిన బ్రాహ్మణులు సైతం తాము వెనుకబడిన వారమనే వాదన తీసుకువస్తున్నారని గడ్కరీ వ్యాఖ్యానించారు. అసలు పేదరికానికి కులం, మతం, లేదా భాషకు సంబంధం లేదని, అన్ని కులాల్లో తిండికి, బట్టకు నోచుకోని వారున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment