సాక్షి,చెన్నైః షేరింగ్ కల్చర్ ప్రపంచాన్ని ఊపేస్తుండటంతో తాజాగా ఖర్చులు తగ్గించుకునేందుకు స్టార్టప్‌లు ఉద్యోగుల షేరింగ్‌కు మొగ్గుచూపుతున్నాయి.వృత్తి నిపుణులను పూర్తికాల ఉద్యోగులుగా నియమించుకుంటే భారీ వేతన ప్యాకేజ్‌లు ఇవ్వాల్సి రావడంతో వ్యయ భారాన్ని మోయలేని స్టార్టప్‌లు ప్రొఫెషనల్స్ సేవలను పార్ట్‌టైమర్లుగా వినియోగించుకుంటున్నాయి. పలు చిన్న కంపెనీలు ఒకే ప్రొఫెషనల్ సేవలను విడతలవారీగా ఉపయోగించుకుంటున్నాయి. ఫైనాన్స్‌లో విశేషానుభవం కలిగి 3ఎం, కోకా-కోలా వంటి దిగ్గజ కంపెనీల్లో పనిచేసిన 51 ఏళ్ల సుబ్రమణియన్ ఇప్పుడు ఒకేసారి డజను స్టార్టప్‌లకు సీఎఫ్‌ఓగా వ్యవహరిస్తున్నారు. ఆయా కంపెనీల్లో ఎప్పుడూ ఒకే సమయంలో పెద్దగా పనిఒత్తిడి ఉండని కారణంగా అవసరమైన సమయంలో వాటికి తాను సేవలు అందిస్తానని, ఇది తనకూ మెరుగైన ఆర్జనకు ఉపయోగపడుతున్నదని సుబ్రమణియన్ చెబుతున్నారు.
ఎక్కువ డబ్బు వెచ్చించలేని స్టార్టప్‌లు ఈ తరహా నిపుణుల షేరింగ్‌ను ఆశ్రయిస్తున్నాయి. చెన్నైకి చెందిన ఆరెంజ్‌స్కేప్ అనే స్టార్టర్‌లో సుబ్రమణియన్ ఏడాదిగా వర్చువల్ సీఎఫ్‌ఓగా వ్యవహరిస్తున్నారు. ఇక జ్యోదిప్ గుప్తా అనే సీనియర్ ఉద్యోగి భిన్న క్యాటగిరీల్లో గత రెండున్నరేళ్లుగా పలు స్టార్టప్స్‌లో పనిచేస్తున్నారు. ఇక గుప్తా తను ఏరోజు ఏ స్టార్టప్‌కు సేవలందించాలనే అంశాలను క్యాలెండర్‌లో మార్క్ చేసుకుంటారు. ఈ తరహా నియామకాలు ముందుముందు మరింత ఊపందుకుంటాయని హెచ్‌ఆర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఒకే ఒక సంస్థకు పరిమితం కారాదని, పూర్తిసమయంలో విధులకు అంకితం కాకూడదనే ధోరణి ఉద్యోగుల్లో పెరుగుతున్నదని చెప్పారు. అయితే స్టార్టప్‌లు ఎదిగిన దశలో మాత్రం పూర్తిస్థాయి సిఎఫ్‌ఓ ఇతర ప్రొఫెషనల్స్ నియామకం అవసరమని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.