ట్రిపుల్ తలాక్‌పై మరో పిటిషన్ వద్దు
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన మరో రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఈ అంశంపై తుది తీర్పు రిజర్వ్ లో ఉండగా, మరొకటి దాఖలు చేయాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.
వివాదాస్పదంగా మారిన తలాక్, బహుభార్యత్వం అంశంపై ఈ ఏడాది మే 11 నుంచి ఆరు రోజులపాటు విచారణ జరిగింది. మతపరమైన హక్కా? లేదా రాజ్యంగ బద్ధమైనదా? అన్న అంశంపైనే సుప్రీంలో వాదనలు జరిగాయి. మే 17 ఇస్లాం మహిళల నుంచి అభిప్రాయసేకరణ చేపట్టాలని కేంద్రానికి సూచిస్తూ తుది తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది.
ఈ నేపథ్యంలో గురుదాస్ మిత్రా అనే వ్యక్తి మరో పిటిషన్ దాఖలు చేయగా, ట్రిపుల్ తలాక్(అహసన్ తలాక్, హసన్ తలాక్ మరియు తలాక్ ఉల్ బిద్దత్) అనేది ఇస్లాం మహిళల హక్కులను ఉల్లంఘించే చర్యేనని సీనియర్ న్యాయవాది సౌమ్య చక్రవర్తి వాదించారు. అయితే ఇదే అంశం గత పిటిషన్‌లో కూడా ఉందని పేర్కొంటూ న్యాయమూర్తులు జేఎస్ ఖేర్కర్ మరియు డీవై చంద్రచూడ్‌లు తాజా పిటిషన్‌ను కొట్టివేశారు.