వామ్మో ఇవేం టోల్ చార్జీలు.. మార్చండి: సచిన్
ముంబై: మహారాష్ట్రలో వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్లపై క్రికెట్ లెజెండ్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు రెండు పేజీల లేఖలను రాస్తూ అందులో టోల్ ట్యాక్స్లపై తన అభిప్రాయాలను రాశారు. ' ముంబైలో సంబంధితశాఖ వసూలు చేస్తున్న రహదారుల పన్నులపై, విధివిధానాలపై నేను చాలా తీవ్ర ఆందోళనలో ఉన్నాను. టోల్ చార్జీలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఇవి ముంబై ప్రజలను శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపెడుతున్నాయి. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు భరించగలిగేలా టోల్ చార్జీలను మరోసారి సంస్కరణలతో పునరుద్ధరించండి' అని పేర్కొన్నారు.
దీంతోపాటు వాహనాదారులు తేలికగా తమ గమ్యస్థానాలకు చేరుకునే ఏర్పాట్లు చేయండి అంటూ సచిన్ పలు విషయాలను లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను ఆయన గత నెల 20న ఎంపీ లెటర్ ప్యాడ్పై రాసి పంపించగా అది తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ లేఖపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. సచిన్ పంపిన లేఖను పరిగణలోకి తీసుకొన్నామని త్వరలోనే చర్చించి చట్టాలకు అనుగుణంగా టోల్ చార్జీలను సంస్కరిస్తామన్నారు. అవసరం లేని చోట టోల్ ప్లాజాలను మూసివేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.