38 ఏళ్లకు తీరిన మాతృమూర్తి కోరిక
అగర్తల: భార్య అంటేనే ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా పెద్ద పనుల గంప ఆమె నెత్తిన కనిపిస్తుంది. తీరిక దొరకడం అనేది చాలా అరుదు. దొరికిన ఆ కాస్త సమయం కూడా సాధారణంగా షాపింగ్లు, ఇంట్లోకి సామాను తెచ్చుకోవడం లాంటి పనులతో కుస్తీ పడుతుంటారు. పుస్తకం పట్టి ప్రత్యేకంగా చదవడం అంటే చాలా కష్టమైన విషయమే. అలాంటిది త్రిపురలో ఓ మాతృమూర్తి తన చిన్ననాటి కలను 38 ఏళ్ల తర్వాత తీర్చుకుంది. ఎలాగైనా తాను బోర్డు పరీక్ష పాస్ కావాలన్న ఆలోచనను అలాగే బతికించుకుని తన పిల్లలతోపాటు పెంచుకొని వారితో కలిసి పరీక్ష రాసి విజయం సాధించా ఔరా అనిపించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. త్రిపురలోని బిశాల్ ఘఢ్ ప్రాంతానికి చెందిన స్మృతి బానిక్ అనే మహిళ 38 ఏళ్ల గృహిణి. ఆమె భర్త కూరగాయలు అమ్ముతుంటాడు. వీరికి ఒక టీ స్టాల్ కూడా ఉంది. ఆమెకు సాగరిక అనే ఓ కూతురు ఉంది. ఆ బాలిక కూడా పదో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో ఆ పాపతోపాటు పుర్బా లక్ష్మీబిల్ హైయర్ సెకండరీ స్కూల్లో పేరు నమోదు చేసుకుంది. ఓపక్క అన్ని పనులు చేసుకుంటూనే కుదిరినప్పుడల్లా చదివిన ఆమె పరీక్షలు రెండు వారాల్లో ఉన్నాయనగా చాలా కఠినంగా శ్రమించింది. కూతురుతోపాటు రాత్రి పూట కూర్చొని చదివి విజయం సాధించింది. 700 మార్కులకు గాను 255 మార్కులు సాధించింది. ఇక్కడ పాస్ పమార్కలు 238. ఇలాగే, చాలామంది మాతృమూర్తులు తమ బిడ్డలతో కలిసి పరీక్షలు రాసి మంచి ఫలితాలు రాబట్టారు.