చెన్నై/న్యూఢిల్లీ: ఆయుధాలు, పేలుడు సామగ్రి తీసుకెళ్తూ భారత జలాల్లోకి ప్రవేశించిన అమెరికా నౌక ‘ఎంవీ సీమేన్ గార్డ్ ఓహియో’పై కేంద్ర విచారణ సంస్థలు పరిశోధన, విశ్లేషణ విభాగం (రా), ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) విచారణ చేపట్టాయి. అంతకుముందు ఓడను నిర్భందించిన సంఘటనపై తమిళనాడు ప్రభుత్వం ప్రాథమిక విచారణ నివేదికను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపింది. ఈ కేసును తదుపరి విచారణ కోసం తమిళనాడు ప్రభుత్వం మెరైన్ పోలీసుల నుంచి క్యూ బ్రాంచ్‌కు బదిలీ చేసిందని ఆ విభాగం డీజీపీ రామానుజం వెల్లడించారు.
అయితే ఓడలో తీసుకువెళుతున్న ఆయుధాలకు సంబంధించి పూర్తి వివరాలు ఓడ సిబ్బంది వద్ద ఉన్నాయో, లేవో నిగ్గు తేల్చి కేంద్రానికి రా, ఐబీ సమగ్ర నివేదిక ఇస్తాయని అధికార వర్గాలు చెప్పాయి. శనివారం ట్యుటికోరిన్‌కు 15 నాటికల్ మైళ్ల దూరంలోకి సియర్రా లియోన్‌లో నమోదైన అమెరికా నౌక భారత జలాల్లోకి వచ్చినపుడు జాతీయ కోస్ట్ గార్డులు నిర్భందించిన సంగతి తెలిసిందే. ఆ ఓడకు డీజిల్ అక్రమంగా సరఫరా చేసిన ఇద్దరు తమిళనాడు పౌరులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారు డీజిల్ మాత్రమే సరఫరా చేశారా లేక ఆయుధాల కోసం వెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓడ సిబ్బంది 10, గార్డులు 25 మందిపై ఆయుధాల చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అమెరికా ‘అక్రమ’ ఓడపై ఐబీ, రా విచారణ
Published Wed, Oct 16 2013 1:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
Advertisement