యూపీ 6వ దశ, మణిపూర్ తొలి దశ ఎన్నికలు నేడు
లక్నో/ఇంఫాల్: ఉత్తరప్రదేశ్‌లో 6వ దశ 49 అసెంబ్లీ స్థానాలతో పాటు మణిపూర్‌లో తొలి దశ 38 నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 1.72 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 635 మంది ఈ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు.
6వ దశ కింద మాయు, గోరక్‌పూర్, మహరాజ్‌గంజ్, ఖుషినగర్, డెఒరియా, ఆజంగఢ్, బాలియా జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆరవ దశలో బీజేపీ 45 స్థానాల్లోనూ, అప్నా దశ్ ఒకటి, సుహెల్దేవ్ బీఎస్పీ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అలాగే బీఎస్పీ.. 49, ఎస్పీ.. 40, కాంగ్రెస్.. 9 చోట్ల బరిలోకి దిగుతున్నాయి.స్వామిప్రసాద్ మౌర్య, సూర్య ప్రతాప్ షాహి, శ్యామ్ బహదూర్ యాదవ్, అంబికా చౌదరీ, నరడ్ రాయ్ లాంటి హేమాహేమీలంతా ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మణిపూర్‌లో తొలి దశ...: తొలి దశ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ దశలో 38 నియోజకవర్గాల పరిధిలో 1,643 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, బిష్ణుపూర్‌తో పాటు కొండ ప్రాంత జిల్లాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 168 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 19, 02, 562 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.