'ప్రపంచమంతా సుఖంగా ఉండాలనేది మా లక్ష్యం'
గాంధీనగర్: ఉగ్రవాదంపై అంతా కలిసి పోరాడాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఫ్రాన్స్ లో పత్రికపై జరిగిన దాడిని ఖండించిన మోదీ.. అందరం కలిసి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలన్నారు. ఆదివారం జరిగిన గుజరాత్ వైబ్రెంట్ సమ్మిట్(ఉజ్వల శిఖరాగ్ర సదస్సు)లో మోదీ ప్రసంగించారు.ప్రపంచం అంతా ఒకే కుటుంబమని భారత్ భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచమంతా సుఖంగా ఉండాలనేదే తమ తుది లక్ష్యమని మోదీ అన్నారు. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.2011, 13ల్లో జరిగిన సదస్సు పెట్టుబడు దారుల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు.
ఈ కార్యక్రమంలో వందకు పైగా దేశాలు పాల్గొన్నందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచదేశాలు భారత్ తో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. త్వరతగతిన అభివృద్ధి చెందుతున్నదేశాల్లో భారత్ కూడా ఒకటని ఐఎఎఫ్ ఎం అంచనా వేసిందన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. ఈ సదస్సుకు ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, యూఎస్ సెక్రటరీ జాన్ కెర్రీలు హాజరయ్యారు.