'నేను నోరు విప్పితే.. ఉద్యోగం పోతుంది'
ముంబై: ఆయన ప్రసంగమంటే ఆర్థికశాస్త్ర విద్యార్థులు చెవికోసుకుంటారు. తమ సందేహాల నివృత్తి కోసం, ఆయన చెప్పే సమాధానాల కోసం పరిశోధక విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆయనే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ . కానీ దేశవ్యాప్తంగా ఉద్రిక్తతను రాజేసిన బీఫ్ వివాదంపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఈ అంశంపై స్పందించి తన ఉద్యోగం పోవాలని కోరుకోవడం లేదని ఆయన సమాధానాన్ని దాటవేశారు. 'సామాజిక ఉద్రిక్తతలు - అభివృధ్దిపై వాటి ప్రభావం' అనే అంశంపై ప్రసంగించిన ఆయన.. బీఫ్ నిషేధం.. రైతుల ఆదాయం, గ్రామీణ అభివృద్దిపై దాని ప్రభావం గురించి విద్యార్థులు ప్రశ్నించినపుడు ఈ మాటలన్నారు.
మంగళవారం ముంబై యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడిన ఆయన 'విద్యార్థులుగా మీకు ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. కానీ నేను అలాకాదు. నేను మాట్లాడితే నా ఉద్యోగం పోతుంది. అలా కావాలని నేను కోరుకోవడంలేదు' అని చెప్పారు. ఆయన సమాధానంతో విద్యార్థులు ఆశ్చర్యపోయారు. ఉద్యోగం పోతుందనే బీఫ్ వివాదంపై తాను నోరు మెదపలేదని చెప్పారు. బీఫ్ నిషేధం, దాని ప్రభావంపై స్పందించడానికి నిరాకరించిన ఆయన ఇంతవరకు తనను ఆ ప్రశ్న అడగనందుకు ధన్యవాదాలు తెలిపారు. వాషింగ్టన్ పీటర్సన్ ఇన్స్టిట్యూట్ కు పనిచేస్తున్న ఆయన 2014 అక్టోబర్ నుండి నుంచి సెలవులో ఉన్నారు.