నాలుగో ప్రపంచ యుద్ధం!
1919లో బ్రిటిష్, ఫ్రెంచ్ వలసవాదులు వదిలి పోయిన తర్వాత అరబ్బు ప్రపంచం ముక్కలు చెక్కలైంది. నయావలసవాద స్వర్గధామమైంది. ఉపయోగించుకోకుండా ఉండే షరతుపై నయావలసవాదం స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తుంది. ఆ ప్రాంతాల్లోని పాలక కుటుంబ వ్యవస్థలు త్వరలోనే వ్యక్తిగత సంపద కు, జాతీయ వనరులకు మధ్య సరిహద్దు రేఖలను మసకబరిచాయి. ప్రతి ప్రయోగమూ నియంతృత్వాల వైపే దొర్లుకుపోయింది. పాశ్చాత్య దేశాలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునే సాధనంగా యుద్ధానికి దిగడం లేదా మరింత హేయమైన పద్ధతుల్లో ప్రభుత్వాలను మార్చడం వల్ల జరిగిన మేలేమీ లేదు.
యుద్ధాలు చాలావరకు గందరగోళపు ఉపోద్ఘాతంతో మొదలై, తరచూ చేదు ఉపసంహారంతో ముగుస్తాయి. 1919 నాటి వర్సెయిల్స్‌కు 1939కి మధ్య ఉన్న పీటముడి నేడు ప్రామాణిక జ్ఞానమే. యుద్ధానంతరం విజేతలు యూరప్‌ను తమలో తాము పంచేసుకొని, గెలుచుకున్న భూభాగాల రక్షణ కోసం మోహరించిన యాల్టాలోనే ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. అఫ్ఘానిస్థాన్‌లో సోవియట్ యూనియన్ ఓటమితో ప్రచ్ఛన్న యుద్ధం అంతం కాగా, సరిగ్గా అక్కడే ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం మొదలైంది.
అఫ్ఘాన్ పోరులో మిత్రులై నిలిచినవారు దాదాపుగా విజయం సాధించిన వెనువెంటనే ఒకరికొకరు విరోధులయ్యారు. 1945 నాటి విజేతలు చేసింది కూడా చాలా వరకు ఇదే. హఠాత్తుగా ఇస్లామిజం వృద్ధి చెందడంతో అమెరికా, యూరప్‌లు దిగ్భ్రాంతికి గురయ్యాయి. చిట్టచివరి ముస్లిం మహాసామ్రాజ్యమైన అట్టోమన్ ఖలీఫా సామ్రాజ్యాన్ని ఛిన్నాభిన్నంచేసి, వలసీకరణం చెందించిన 1919 నాటి ద్వితీయ కథనాన్ని విస్మరించడమే వారి నివ్వెరపాటుకు కారణం. సమస్యాత్మకమైన ఒక శతాబ్ది గడిచిన తదుపరి... నాలుగవ ప్రపంచ యుద్ధం తో కలగలిసేలా మొదటి ప్రపంచ యుద్ధం మళ్లీ తిరిగి వస్తోంది. ప్రపంచంలోనే ముస్లిం జాతుల ప్రజలు అత్యధికంగా ఉన్న భారత ఉపఖండంలోని మొఘల్ సామ్రాజ్య అవశేషాలను బ్రిటన్ 1919కి దాదాపు ఏడు దశాబ్దాలకంటే ముందుగానే భూస్థాపితం చేసింది. (విక్టోరియా రాణి పాలన కిందనే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారంటూ నాటి చాదస్తపు పొగరుబోతు రాజకీయ వేత్తలు... నిజమైన ఖలీఫా ఆమే అంటూ అట్టోమన్లను వేధించేవారు.) 1919లో ఒక విపరీత పరిణామం జరిగింది: యూరోపియన్ దేశాలు ముస్లిం భూభాగా ల్లో ప్రతి ఒక్కదాన్నీ ఆక్రమించడమో లేక వలసగా మార్చడమో చేశాయి. అది వారికి భరింపశక్యం కానంతటి పెద్ద అవమానం.
గంగా నది నుండి నైలు నది వరకు అంతటా ముస్లింలు గత వైభవ పునరుద్ధరణ కోసం అన్వేషించారు, అలా పరితిపించడంలోనే సౌఖ్యాన్ని పొందారు. ఖలీఫా రాజ్యం వాస్తవంగా ఎన్నడూ లేనంతటి ఉజ్వలమైనదిగా జ్ఞాపకాలలో భాసిల్లింది. ఖలీఫా రాజ్యం పట్ల ఈ ఆరాధన ఒక శక్తివంతమైన ప్రేరణ అయింది. ముస్లింలు నిరంతర ముట్టడిలోనున్న యుగంలో ఖలీఫా రాజ్యం ఇస్లాం మత, మత పవిత్ర స్థలాల పరిరక్ష ణకు సంకేతమైంది. గత వైభవానికి ఉద్వేగభరితమైన సంకేతమైంది. తమ సొంత నియంతల నిరంకుశత్వం నుండి ముస్లింలకు రక్షణగా షరియా ఉంటుందన్న భరోసాను వారికి కలిగించింది. భారత దేశంలో మహాత్మా గాంధీ మహాశక్తిని 1919-1922 మధ్య బ్రిటిష్ వ్యతిరేక ప్రజోద్యమంలోకి ముస్లింలను ఆకర్షించడానికి ఉపయోగించుకున్నారు. 1924లో టర్కీ ఖలీఫా వ్యవస్థను నిషేధించడం నాటి ఖిలాఫత్ ఉద్యమానికి పరిహాసోక్తిలాంటి ముగింపు.
ముస్తఫా కెమల్ పాషా నేతృత్వంలోని టర్కీ 20వ శతాబ్దంలోకి హేతుబద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. హాప్స్‌బర్గ్‌లు, జార్‌లలాగే ఖలీఫాలు కూడా ప్రయోజనాన్ని కోల్పోయినా ఇంకా మిగిలివున్న యుగానికి చెందినవని గుర్తించింది. భారత ముస్లింలలోని ఉన్నతవర్గాలు బ్రిటన్ కత్తితో 1947లో తమకంటూ ప్రత్యేకంగా పాకిస్తాన్‌ను విడిగా కత్తిరించి తీసుకున్నారు. దీంతో వారికి వారి ఆందోళనల నుండి ఉపశమనం లభించింది. భగవంతుని భౌగోళికత పాకిస్తాన్‌ను ఉపఖండానికి రెండు కొసల్లోను ఉండే రెండు భాగాలుగా విడదీసింది.
అయినాగానీ మతం వాటిని ఐక్యం చేయగలదని పాకిస్థాన్ వెర్రిగా విశ్వసించింది. నిజానికి పాకిస్థాన్ దక్షిణాసియా టర్కీ కాగలిగేదే. కానీ అందుకు బదులుగా అది మతపరమైన ఉద్వేగాలను, ప్రజాస్వామ్యాన్ని కలగలిపింది. ఆ రెండు ప్రపంచాలలోనూ అది అత్యంత అధమమైన దాన్ని సాధించడంలో సఫలమైంది. వలసవాద అనంతర కాలంలో పాకిస్తాన్ దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి ఇస్లామిక్ దేశం అయింది. ప్రజల్లో సమంజసత్వాన్ని సంపాదించుకోడానికి అనివార్యంగానే అది జిహాద్ జెండాను పట్టిన నానా గోత్రీకులైన ఉగ్రవాదులకు సురక్షిత స్థావరమైంది.
1919లో బ్రిటిష్, ఫ్రెంచ్ వలస యజమానులు వదిలి పోయిన తర్వాత అరబ్బు ప్రపంచం ముక్కలు చెక్కలైంది, చీలికలు పీలికలైంది. నయావలసవాద స్వర్గధామమైంది. ఉపయోగించుకోకుండా ఉండే షరతుపై నయావలసవాదం దేశాలకు, ప్రజలకు స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తుంది. అదైనా ఆర్థిక సాధికారత, ప్రజాస్వామిక స్వేచ్ఛలతో కూడినదై ఉండి ఉంటే అదేమైనా పనికొచ్చి ఉండేదేమో. కానీ నయావలసవాదం అలా ఉండాలనే యోచనే ఒక వైరుధ్యం కావచ్చు. కుటుంబ వ్యవస్థలు త్వరలోనే వ్యక్తిగత సంపదకు, జాతీయ వనరుల కు మధ్య సరిహద్దు రేఖలను మసకబరిచాయి. వామపక్షం నుండి పుట్టుకొచ్చినదైనా లేక మితవాదపక్షం నుండి పుట్టుకొచ్చిందైనాగానీ... ప్రతి ప్రయోగమూ మృదువైన లేదా కఠోర నియంతృత్వం వైపే దొర్లుకుపోయాయి. పాశ్చాత్యదేశాలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునే సాధనంగా యుద్ధానికి దిగడం లేదా మరింత హేయమైన పద్ధతుల్లో ప్రభుత్వాలను మార్చడం వల్ల జరిగిన మేలేమీ లేదు.
ఆధునికతకు సంబంధించిన వైఫల్యమేదైనాగానీ ఊహాత్మకమైన గతానికి ఆహ్వానం పలికేదే. రాచరిక పితృస్వామ్యం నుండి నాజర్ తరహా జనరంజక విధానాల వరకు, బాతిస్టుల ఉదారవాదం వరకు అన్ని నమూనాలు మిగతావాటిలాగే సైనిక నియంతృత్వానికి దారితీశాయి. చివరకు తాత్కాలిక ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లువెత్తినా... అదీ కుప్పకూలింది, అణచివేతకు గురైంది. కడకు నిలచినది మత విశ్వాసానికి తిరిగి పోవడమనే భావన ఒక్కటే. వర్తమాన నేపథ్యంలో దీనికి అర్థం ఏమిటో ఏ ఒక్కరికీ తెలియదనేది వేరే సంగతి. అది చేసింది ఒక్కటే... మదీనా పట్ల విశ్వాసాన్ని తగ్గించి, అరేబియాలోనూ, భారత్‌లోనూ ఇస్లామిక్ మిలిటెన్సీ పుట్టి పెరిగేలా చేయడం మాత్రమే. ఆ ధోరణి ముస్లింలలో అభద్రతను, తీవ్రవాదాన్ని పెంపొందింపజేసి నిరాశావాదాన్ని రేకెత్తించడానికి తోడ్పడిందే. తద్వారా మన దేశంలో భ్రమాత్మకమైన విముక్తి ముసుగులోని అరాచక పరిస్థితుల అన్వేషణలో వెర్రిగా మారిన జిహాద్‌కు ప్రేరణ లభించింది. ఈ క్షీణత అతి వేగంగా సాగింది. నేడు పాకిస్తాన్ నుండి ఉత్తర ఆఫ్రికా వరకు అల్లకల్లోలంగా ఉంది. ఆ ప్రాంతంలో చాలా ప్రభుత్వాలు ఏకాకులయ్యాయి, దేశాలు అదుపు తప్పి పోతున్నాయి.
ఇస్లామిక్ సిద్ధాంతం ప్రకారం జిహాద్ అనేది రాజ్యం ప్రకటించేదిగా ఉండటమనేదే మౌలిక ఆవశ్యకత. ఈ సంప్రదాయ విరుద్ధమైన జిహాద్ ప్రమాదకరంగా విస్తరిస్తుండటమే సిద్ధాంతాన్ని వదిలేసిన ఆచరణవల్ల కలిగే ప్రమాదాలకు రుజువు. జిహాద్‌కు లక్ష్యాలుగా ఉన్న ‘సుదూరంలోని శత్రువు’ అంటే ప్రధానంగా అమెరికా, కాగా, ‘సమీప శత్రువు’ అంటే తక్షణ పరిసరాల్లో వారితో వైరం గలవారంతా. ఇక ‘మూడో శత్రువు’ అంటే ఇస్లామిక్ భూభాగాలను ‘ఆక్రమించిన’ దేశాలు. భారత్, చైనాలు (జింజియాంగ్‌లో ముస్లింలు మెజారిటీ కాబట్టి) ఈ చివరి వర్గానికి చెందుతాయి.
ఈ యుద్ధం ఎప్పుడు, ఎలా అంతమవుతుందో అంచనా కట్టడం కష్టం. అయితే ఇది మిగతా వారికి నష్టం కలిగించడం కంటే ముందే ముస్లిం ప్రజలకు వినాశనాన్ని కలుగజేస్తుంది.
(నవంబర్ 21 నుండి 23 వరకు జరిగిన ‘‘హాలిఫాక్స్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్’’ ప్లీనరీ సందర్భంగా చర్చనీయాంశంగా రచించిన వ్యాసమిది.)