నాకూ వెన్నెలే ఇష్టం, కానీ... | i like moon light, but.. | Sakshi
Sakshi News home page

నాకూ వెన్నెలే ఇష్టం, కానీ...

Published Sun, Jul 12 2015 4:30 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

నాకూ వెన్నెలే ఇష్టం, కానీ... - Sakshi

నాకూ వెన్నెలే ఇష్టం, కానీ...

‘రచయితలారా మీరెటు వైపు?’ అన్న ప్రశ్నకు స్పందనగా ఆవిర్భవించిన విప్లవ రచయితల సంఘం, నేడు 45వ ఆవిర్భావ దినం జరుపుకుంటోంది. హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఉదయం 9:30 నుండి వివిధ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో
 ‘విప్లవ కవి’ వరవరరావుతో చిరు ముఖాముఖి:
 
     ఏమిటి ఈసారి ప్రధాన ఎజెండా?
 సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం; భూస్వామ్య సంస్కృతికి కేంద్రస్థానంగా ఉండి, సామ్రాజ్యవాదానికి దళారీ కేంద్రంగా మారిపోయిన కేంద్రానికి వ్యతిరేక పోరాటం.
     విరసం ఆవిర్భావ సమయానికీ ఇప్పటికీ ఏమైనా తేడా ఉన్నదా?
 ప్రజల మౌలిక సమస్యల్లో మార్పేమీ లేదు. దళితులకూ ఆదివాసీలకూ వనరుల్లో న్యాయమైన వాటా అందడం లేదు.
     మీరు కోరేది రాజకీయ మార్పా? సాంస్కృతిక మార్పా?
 రెండూ. పునాది రాజకీయార్థికమే. దాని సూపర్ స్ట్రక్చర్ సాంస్కృతికం. దానికి సాహిత్యం దోహదం చేస్తుంది. పునాదే సూపర్ స్ట్రక్చర్‌ను ప్రభావితం చేస్తుందనుకునేవాళ్లం. ఇప్పటి అవగాహన ప్రకారం, సూపర్ స్ట్రక్చర్ కూడా పునాదిని ప్రభావితం చేస్తుంది.
     సృజనశీలికి ప్రత్యక్ష కార్యాచరణతో సంబంధం ఉండాలా?
 కార్యాచరణలో ఉంటేనే సజీవ సాహిత్యం వస్తుంది. అయితే, ట్రిగ్గర్ మీద వేలు ఉంచినప్పుడు కార్యాచరణలో ఉన్నట్టా? గుడారంలో అలసటగా నడుం వాల్చి కవిత రాస్తున్నప్పుడు కార్యాచరణలో ఉన్నట్టా? ఏది ప్రత్యక్ష కార్యాచరణ? ఏది కాదు?
     సాహిత్యాన్నీ రాజకీయాన్నీ ఎలా చూడాలి?
 రాజకీయం కాని సాహిత్యం లేదు. గెలిచినవాళ్లది ప్రధాన స్రవంతి అవుతుంది, గెలవాల్సిన వాళ్లది రాజకీయం అవుతుంది. అంతెందుకు, మన తొలికావ్యాలు రామాయణం, భారతాలు కూడా రాజకీయాలే! తిక్కన మనుమసిద్ధి ఆస్థానంలో ఉండి, యుద్ధరంగాన్ని చూశాడు కాబట్టి, యుద్ధపర్వం అంత బాగా రాశాడంటారు. మేము దండకారణ్యం వెళ్లి చూసి రాసిందేమో రాజకీయ సాహిత్యం అయిపోతుంది. నాక్కూడా వెన్నెల మీదా, పువ్వుల మీదా కవిత్వం చెప్పాలనే ఉంటుంది. కానీ నా వెన్నెలనీ, పువ్వులనీ నాక్కాకుండా చేస్తున్నవాడు కనబడుతున్నప్పుడు అనివార్యంగా నేను ఆ విధ్వంసం గురించే మాట్లాడాల్సి వస్తున్నది.
     {పాచీన సారస్వతాన్ని మీరు ఎలా చూస్తారు?
 మనకు చరిత్ర రచన లేదు కాబట్టి, రామాయణ, భారతాలు ఆ లోటు పూడుస్తాయి. బిట్వీన్ ద లైన్స్ చదివినంతవరకూ ఎవరికైనా వాటిపట్ల ఎందుకు అభ్యంతరం ఉండాలి!
     తెలంగాణలో రాబోయే పాలకపక్షం మీ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తుందన్న నమ్మకంతోనే ‘ప్రత్యేక’ పోరాటానికి మద్దతిచ్చారా?
 పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే మౌలిక ప్రజల ఆకాంక్షను తీర్చదనేదే మా అవగాహన. అయితే, స్వరాష్ట్రం- స్వాభిమానం- స్వపరిపాలన కోసం మేము సైతం తెలంగాణ రాష్ట్రోద్యమంలో పాల్గొన్నాం. మేము ఓపెన్ కాస్టులకు వ్యతిరేకం, భారీ ప్రాజెక్టులకు వ్యతిరేకం. మా ఆలోచనల దిశగా పాలకుల నడక సాగట్లేదు కాబట్టి, ఇప్పుడు వారికి వ్యతిరేకం. ఢిల్లీ సుల్తాన్ల మీద పోరాడిన ప్రతాపరుద్రుడిని మెచ్చుకున్నాం. అదే ప్రతాపరుద్రుడి మీద పోరాడాల్సి వచ్చిన సమ్మక్క సారక్కవైపున్నాం. రచయిత ఎప్పుడూ ప్రతిపక్షంగా ఉండాలి, న్యాయం వైపుండాలి.
 - షేర్‌షా
 ఫొటో: ఎం.అనిల్ కుమార్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement