తెలంగాణ పోరాట యోధుడు-పల్వెల
‘....గంజ్‌లో పలానాయన ఉన్నాడు. మీరక్కడ ఉంటారా?’ అని అడిగాడు జైలరు. సంతోషంగా, ఆయన పక్కనైతే గంజ్‌లో ఏమొచ్చె, నరకంలోనైనా ఉంటాననుకున్నాను మనసులో’ (సహచరులు- మనుషులు-1989 జూలై పే.77) ఆయనే పల్వెల రామిరెడ్డి. ఈ (2, అక్టోబర్) ఉదయమే ఆయన కొడుకు ఫోన్ చేసి ‘బాపు చనిపోయాడు. నేను కూడా దుబాయ్ నుంచి వార్త తెలిసే వచ్చాను. ఫలానారోజు సంస్మరణ. రండి’ అని చెప్పాడు. 92 ఏళ్ల యువకుడు రామిరెడ్డి. ఆయన గురించి ‘సహచరులు’లో ఇట్లా రాసుకున్నాను.
‘తెలంగాణ రైతాంగ పోరాటకాలం నుంచి, అంటే 1946 నుంచి 86 దాకా నలభై ఏళ్లుగా జైలుకు వస్తూపోతూ ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన మిత్రుడు అందులో ఒక సెల్‌లో ఉన్నాడు. కార్మిక రంగంలో పనిచేస్తూ, నక్సలైట్ ముద్రతోనే అరెస్ట యిన మరొక యువకుడున్నాడు. ఆయనతో నాకు ఈ జైల్లోనే పరిచయం. ఆ నల్లగొండ మిత్రునితో మాత్రం ఎమర్జెన్సీలో వరంగల్ జైల్లో పరిచయ మైంది. ఈ ఇద్దరితో మొదటి రెండు నెలలు ఒకటి కాలప్రవాహం వలె, రెండవది యవ్వన ప్రవాహం వలె గడిచిపోయాయి. ఆ నల్లగొండ మిత్రుడు విస్తృతంగా దేశం తిరిగాడు. విస్తృతంగా చదివాడు. ఆచరణ నుంచి జ్ఞానం వస్తుందనడానికి ఆయన సజీవ సాక్ష్యం. ఎన్ని అనుభవాలు చెప్పేవాడో. లాకప్ అయ్యేదాకా ఆ అవరణలో ముగ్గురమూ కలసి అటూ ఇటూ పచార్లు చేస్తూ ఆయన మాటలు వింటుండేవాళ్లం. తిరుగుతూనే పుస్తకాలు చదవడం ఆయనకలవాటు...’
వాళ్లిద్దరూ టాడా కింద అరెస్టయి వచ్చారు. రామిరెడ్డిగారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుడు. నక్సల్బరీ, శ్రీకాకు ళం రైతాంగ పోరాట విస్ఫోటనతో తెలంగాణలో తిరిగి ప్రారంభ మైన విప్లవోద్యమంలో ఆయన మొదట దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో పనిచేశాడు. ఎమర్జెన్సీ ప్రకటించిన రోజే బండ్రు నరసింహులు (ఆలేరు)గారిని అరెస్టు చేసి నేనున్న గదిలోనే పెట్టారు. అప్పుడు రామిరెడ్డిగారితో గాఢా నుబంధం ఏర్పడలేదు. ఎన్‌కె వంటి విప్లవ కవి, చెరుకూరి రాజకుమార్ వంటి రాడికల్ విద్యార్థి నా గదిలోనే ఉండడంవల్ల మా లోకం మాదిగా ఉండేది.
రామిరెడ్డిగారు మిగిలినవారి వలె ఏ ప్రజాసం ఘంలోనూ పనిచేసినట్లు లేరు. ఇంగ్లిష్, ఉర్దూ భాష లలో ప్రావీణ్యం వల్ల సీపీ నాయకత్వంలోని పార్టీ ఆయనను బయటి రాష్ట్రాలలో టెక్నికల్ సహాయా లకు వినియోగించుకున్నట్లుంది. ఇంగ్లిష్ నవలలు గురించి, ముఖ్యంగా చార్లెస్ డికెన్స్ ‘రెండు మహా నగరాలు’, నెపోలియన్ జీవితచరిత్రల గురించి మాట్లాడేటప్పుడు యుద్ధనీతి, ఆయుధాల గురించి చెప్పే విషయాలు అందులో ఆయనకు లోతైన జ్ఞానం ఉన్నదని అనిపించేది. బక్క పలచటి మనిషి. ఆరడుగుల పొడవు, ధోతీ, తెల్లటి అంగీ. ఎప్పుడూ పెదవులపై చిరునవ్వు. సంభాషణాప్రియుడు. మా ఇద్దరి అభిరుచి సాహిత్యం, విప్లవ రాజకీయాలు. మా స్నేహం నేను నల్లగొండ చౌరస్తాలో 2014 జూలై దాకా ఉన్నంతవరకు కొనసాగింది. ఆయన దిల్‌సు ఖ్‌నగర్‌లో ఉండేవారు.
చివరిరోజుల్లో చేతికి కర్ర, చెవుడు వచ్చినట్టున్నాయి. కానీ అదే ఉత్సాహం. జర్నలిస్టుగా ఉన్న ఆయన మేనల్లుడు అనుకుం టాను, ఆయన జీవితచరిత్ర, మిత్రుల జ్ఞాపకాలు రాయించే ప్రయత్నం రెండేళ్ల క్రితం చేసినట్టున్నాడు. నా దగ్గరకి కూడా వచ్చారు. చెప్తానన్నాను. కానీ జీవన వ్యాపకాలలో పడిపోయాం. అంతేనా- ముగి సిపోని, కొనసాగుతున్న తెలంగాణ పోరాట చరిత్ర కనుక, ఇంకా నిర్మాణంలోనే ఉన్న అసంపూర్ణ ప్రజా స్వామ్య పోరాట చరిత్ర కనుక అప్పుడు చరిత్ర రచ నకు సమయం చిక్కడం లేదా? లేదా ఇంకా ఎందరో పోరాటయోధులు రక్తంతో చరిత్ర రచన కొనసాగు తున్నదా? బండ్రు నర్సింహులు నూరేళ్ల పండుగ నూటొక్క పాటల సంబురంలో పి.చంద్ రాసిన ‘సాయుధ పోరాటయోధుని కథ’ ఆవిష్కరించుకు న్నాం. రామిరెడ్డిగారంటే, బండ్రు నర్సింహులు వలెనే ఇంచుమించు నూరేళ్ల తెలంగాణ చరిత్ర. ఏడు దశాబ్దాలకు పైగా పోరాట చరిత్ర. జీవితమంతా ప్రజా పోరాటాలతో పరుచుకున్న చరిత్ర.
- వరవరరావు, విరసం వ్యవస్థాపక సభ్యులు
మొబైల్: 96765 41715