మారాల్సిందెవరు? మార్చాల్సిందేమిటి?
ప్రస్తుత విద్యావ్యవస్థలో మార్పులను ప్రవేశ పెట్టడం గురించి కేంద్ర మానవ వనరుల అభి వృద్ధి శాఖామాత్యులు స్మృతి ఇరానీ పలు ప్రకట నలు చేశారు. అయితే ముందుగా ప్రస్తుత వ్యవస్థ ఎందుకు సక్రమంగా పనిచేయడం లేదనే విష యాన్ని వారు లోతుగా ఆలోచించాలని మా మనవి. మాకు తోచిన కొన్ని ముఖ్య అంశాలను సూచిస్తున్నాం. అమాత్యులు వాటిని దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాం.
అధికార స్థానాల్లో ఉన్న వారు అతి తేలికగా చేయగలిగిన పని సంస్థలను స్థాపించడం. కానీ ఆ సంస్థలను సక్రమంగా పనిచేయించి, అవి వాటి లక్ష్యా లను సాధించేలా చేయగలగడం అంతకంటే మరింత ముఖ్యమైనది. ప్రభుత్వ పాఠశాలలు బాగా పనిచేయ డం లేదన్న విషయం మనకు తెలిసిందే. కానీ వాటిని సక్రమంగా పనిచేయించడంలో ప్రభుత్వాలు ఎందుకు ఆసక్తిని చూపడం లేదు? అనేదే అంతుపట్టదు.
వీఐపీలు గా పిలిచే మంత్రులు, శాసనసభ్యులు ఈ సంస్థలను నడుపుతున్నారే గానీ అవి బాలల మనసులను అవి ఎలా మలుస్తున్నాయనే విషయాన్ని మాత్రం పట్టించు కోవడం లేదు. పైగా వారే విద్యార్థులకు అన్నిరకాల చట్టవిరుద్ధ, అనైతిక కార్యకలాపాలను మప్పుతుండటం శోచనీయం. కొన్ని విద్యాసంస్థలు ఆయా ప్రాంతాలకు అలంకారప్రాయమైననిగానే ఉంటున్నాయి. ఆ ప్రాంత ప్రజలకు సంబంధించినవిగా మాత్రం ఉండటం లేదు. వాటికి గుర్తింపును ఇచ్చే సంస్థలు సైతం హోదాకు చిహ్నాలే. అలాంటి విద్యా సంస్థల నిర్వహణ చూసే వారికి ఇక వాటి ద్వారా సమకూరే చట్టబాహ్య ప్రయో జనాల పట్లనే ఆసక్తి ఉంటోంది, తప్ప విద్యాబోధన, దాని నాణ్యత మాత్రం పట్టడం లేదు. అవినీతిమయ మైన ఇలాంటి సంస్థలు విద్యార్థులలో ఎలాంటి విలు వలనైనాగానీ పెంపొందింపజేయగలవని ఆశించడం అత్యాశే అవుతుంది.
నిజంగానే మనకు ప్రతిభలో అంత ఆసక్తి ఉంటే, ముందుగా విద్యారంగంలోని అన్ని శాఖల్లోనూ డొనేషన్ల పద్ధతికి స్వస్తి పలకాల్సి ఉంటుంది. మేనేజ్‌మెంట్ కోటా లను అనుమతించడమంటే విద్యాసంస్థల నిర్వహణలో అవినీతికర పద్ధతులను ప్రోత్సహించడమే. కాబట్టి తక్ష ణమే డొనేషన్లు, మేనేజ్‌మెంట్ కోటాలకు స్వస్తి పలకడా నికి పూనుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతిభకు ప్రాధా న్యం లభించాలంటే గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో దేశవ్యా ప్తంగా కామన్ సిలబస్‌ను అన్ని తరగతులు, గ్రేడ్‌లలో అనుసరించేలా చేయడం అత్యావశ్యకం. దైనందిన జీవి తానికి పనికిరాని నాసిరకం విద్య కోసం గణనీయమైన మొత్తాలను వెచ్చించడం ప్రజాధనాన్ని వృథా చేయడమే అవుతుంది. దైనందిన జీవితానికి, ఉపాధికి సోపానాలు కాగల సిలబస్‌ల రూపకల్పనను రూపొందించాలి. సిద్ధాంత బోధనతో పాటూ విద్యార్థులకు ప్రాక్టికల్ తరగ తులు కూడా అవసరమని ప్రభుత్వాలు గుర్తించాలి. అం తేకాదు టెక్నికల్ కోర్సుల రూపకల్పనలో పారిశ్రామిక రంగానికి చెందిన నిపుణులను భాగస్వాములను చేయా లి. ఎప్పటికప్పుడు సిలబస్‌ను అభివృద్ధి చేయడంలో, సవరించడంలో వారి సహకారాన్ని స్వీకరించడం అవస రం, మన పరిశోధనా సంస్థలు వాటి పనిని అవి సక్ర మంగా చేయడం లేదనే విషయాన్ని కూడా అమాత్యులు దృష్టిలో ఉంచుకోవాలి.
ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాల పెంపుదల పట్ల, ప్రతిభ పట్ల నిజంగా పట్టింపు ఉంటే ప్రభుత్వోద్యోగు లు, రాజకీయవేత్తలు, ప్రభుత్వం వలన లబ్ధి పొందుతు న్న వారంతా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చా లి. అదే జరిగితే మన పాఠశాలల పరిస్థితి నిస్సందే హంగా బాగుపడుతుంది. అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యా ప్రమాణాలకు, నాణ్యతకు బాధ్యత వహించాలి. కష్టజీవుల రక్త స్వేదాలపై ఆధారపడి బతుకుతు న్నామనే ఎరుకను కలిగి అంకితభా వంతో పనిచేయాలి. టీచర్ల న్యాయమైన సర్వీసు వ్యవహా రాల కోసం పనిచేయడానికి యూనియ న్లను అనుమతించవచ్చు.
కానీ అవి రాజకీయ సాధనాలు కాకూడదు. ప్రభుత్వం నుంచి జీతాలు పుచ్చుకునే ఉపాధ్యాయులను కూడా ఈ విషయంలో ప్రభుత్వోద్యోగులతో సమంగానే చూడాలి. రాజకీయాల్లో పాల్గొనడానికి వారికి అదనపు హక్కులను అనుమతించరాదు. రాజ కీయాలకు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి తొలగించాలి. ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వాలు బుజ్జగింపు వైఖరిని విడనాడాలి.
పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు తప్పుడు పద్ధతులకు పాల్పడటం, పరీక్షా పత్రాల మూల్యాంకనలో జరిగే అక్ర మాలు, తప్పులను తప్పనిసరిగా అరికట్టాలి. అర్హతలు లేని ఉపాధ్యాయుల నియామకాలు, విపరీతమైన ట్యూషన్ ఫీజుల వసూళ్లు, తనిఖీ సమయంలో నకిలీ రికార్డులు, సర్టిఫికెట్ల సమర్పణకు అడ్డుకట్ట వేయాలి. ఇక డీమ్డ్ యూనివర్సిటీలు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పేరిట జరిపే తంతుతో తల్లిదండ్రుల మనస్తత్వాన్ని అడ్డుపెట్టుకొని భారీ మొత్తాలను పుచ్చుకొని ప్రొఫెషనల్ కోర్సుల సీట్ల ను భర్తీ చేస్తున్నాయి. మన ఇంజనీరింగ్ కళాశాలల్లో అధికభాగం తగు అర్హతలు లేని ఉపాధ్యాయులతోనే నడుస్తున్నాయని అందరికీ తెలిసిందే. యూజీసీ, ఏఐసీ టీఈ, ఎమ్‌సీఐ, తదితర నియంత్రణ సంస్థలు ఏం చేస్తు న్నట్టు? పరిస్థితి ఇలా ఉండగా... అందుకు బాధ్యత వహించాల్సిన వారే విద్యా వ్యవస్థలో నైతిక, ఆధ్యాత్మిక విలువలు లోపించడమే ఈ దుస్థితికి కారణమని ఇంటి కప్పెక్కి మరీ గగ్గోలు చేస్తుండటం విడ్డూరం.
జె.వి.రమణారెడ్డి
(ఎస్.ఆర్.శంకరన్ గ్రామ చైతన్య కేంద్రం కార్యకర్త)