అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తాడని అంచనాలు పెట్టుకున్న హర్దిక్ పటేల్‌కు ఊహించని రీతిలో షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరులుగా చెప్పుకునే వరుణ్ పటేల్, రేష్మ పటేల్‌లు బీజేపీ గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు.
పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) లో కీలక నేతలుగా వీరిద్దిరి పేర్లే ఎక్కువగా వినిపిస్తుండేవి. అంతేకాదు పటేల్ ఉద్యమంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రసంగాలు గుప్పించని వారిలో వీరే ముందుడటం కొసమెరుపు. బీజేపీ చీఫ్ అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌తో భేటీ అనంతరం వారు బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు జీతు వగ్హని మీడియా సమక్షంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వరుణ్, రేష్మలు మాట్లాడుతూ.. హర్దిక్ కాంగ్రెస్ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ ఉద్యమం వంకతో ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయటమో.. లేక కాంగ్రెస్ ను అధికారంలోకి తేవటమో తమ ఉద్దేశం కాదని, పటేల్‌లను ఓబీసీ కోటా చేర్చాలన్నదే తమ లక్ష్యమని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. ఆదివారం వీరిద్దరు కమలం కండువా కప్పుకోనున్నట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు.
కాగా, ఎవరు తనను వీడినా ఒంటరి పోరాటానికైనా తాను సిద్ధమంటూ హర్దిక్ ట్విట్టర్ లోతెలియజేశాడు. ఇదిలా ఉంటే గుజరాత్‌లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.. దీనికి తోడు తమతో చేతులు కలపాలని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపిన కొద్ది గంటల్లోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment