సాక్షి, న్యూఢిల్లీ : ప్లీనరీ వేదికగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై చేసిన విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది. ఓటమి నైరాశ్యంతో రాహుల్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎమర్జెన్సీ విధించడం.. సిక్కులపై హింసను ప్రోత్సహించడం వంటి చర్యలకు పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీని సత్యానికి కట్టుబడ్డ పాండవులతో పోల్చే అర్హత లేదని రాహుల్‌కు హితవు పలికారు. హంతకులను పార్టీ అధ్యక్షుడిగా బీజేపీ ఆమోదించిందని రాహుల్ చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. అమిత్ షాపై ఆరోపణలను కోర్టు కొట్టివేసిందని, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ బెయిల్‌పై విడుదలయ్యారని గుర్తుచేశారు. స్వాతంత్ర్య పోరాటంలో ఒకే కుటుంబ త్యాగాలను ప్రస్తావించే రాహుల్ వీర్ సావర్కర్ వంటి ఇతరుల పాత్రను తగ్గిస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ వరుస ఓటములను ఎదుర్కొంటున్నదన్న రాహుల్ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ యూపీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. న్యాయవ్యవస్థలో ఇటీవల సంక్షోభాన్ని రాహుల్ ప్రస్తావించడంపై మండిపడ్డారు. ఎన్నికల అక్రమాలపై అలహాబాద్ హైకోర్టు తప్పుపట్టిన అనంతరం న్యాయవ‍్యవస్థ పట్ల ఇందిరాగాంధీ వ్యవహరించిన తీరు ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ సైతం మీడియాను అణిచివేసేందుకు ప్రెస్ డిఫెమేన్ బిల్లును తీసుకువచ్చిన సంగతి గుర్తెరగాలన్నారు.మరోవైపు జీఎస్‌టీ సంక్లిష్టంగా ఉందంటూ రాహుల్ చేసిన విమర్శలను కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తోసిపుచ్చారు. జీఎస్‌టీని కీర్తిస్తూ వచ్చిన నివేదికలను ఓపికగా పరిశీలించాలని ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment