సాక్షి, విశాఖపట్నం : సుజనా చౌదరి అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్మించిన ఆర్థిక నేర సామ్రాజ్యంలో సుజనా చౌదరి ఒక నేరగాడు మాత్రమేనని, మరింత మంది బయటపడాల్సి ఉందన్నారు. సుజనా చౌదరి కేవలం చంద్రబాబు బినామీ మాత్రమేనని, అసలు లబ్ధిదారుడు చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు.(సుజనాచౌదరి బ్యాంకుల లూటీ మొత్తం 6,000 కోట్లు)
దేశంలోని బ్యాంకులన్నింటనీ మోసం చేసి కొట్టుకొచ్చిన డబ్బును.. చంద్రబాబు బినామీల ద్వారా రాజధాని భూములను కొనుగోలుకు, విదేశీ ఖాతాల మళ్లింపుకు ఉపయోగించారన్నారు. సుజనా ఒక్కరే కాదు.. చంద్రబాబు పెంచి పోషించిన అనేకమంది సుజనాలు, సీఎం రమేష్‌లు బయటకురావాల్సి ఉందన్నారు. అనకాపల్లి నుంచి మొదలు అమరావతి వరకూ ఎక్కడ చూసినా అవినీతే కన్పిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజల్లో టీడీపీపై వస్తున్న వ్యతిరేకతను దృష్టి మరల్చేందుకే చంద్రబాబు దేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి దోపిడీ దారులు బయటకు వస్తారనే రాష్ట్రంలో సీబీఐ ప్రవేశాన్ని రద్దు చేశారని ఆరోపించారు.
పవన్ ఎందుకు నోరెత్తడం లేదు
సుజనా చౌదరి దోపిడీ మీద జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరెత్తడం లేదని బొత్స ప్రశ్నించారు.టీడీపీ ని గెలిపించానని చెబుతున్న పవన్ ఆ పార్టీ అక్రమాలకు బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వార్తలు రాగానే.. వాటిని డైవర్ట్ చేయడానికి పవన్ స్టేట్‌మెంట్లు వస్తున్నాయని మండిపడ్డారు. సంక్రాంతి తర్వాత ఎన్నికలు వచ్చే సంకేతాలు ఉన్నాయని.. ఎప్పుడు వచ్చినా పార్టీని గెలిపించడానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని బొత్స పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment