సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్టు నందమూరి సుహాసిని చెప్పారు. కూకట్‌పల్లి నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తుండటం గర్వంగా ఉందని చెప్పారు. తన తాత ఎన్టీఆర్, నాన్న హరికృష్ణ స్ఫూర్తితో రాజకీయాల్లో వచ్చానని.. ప్రజల కోసం రాత్రింబవళ్లు కష్టపడతానన్నారు. ప్రజలకు సేవ చేస్తానన్న నమ్మకంతోనే తనకు సీటు ఇచ్చారని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలన్న కోరిక చిన్నప్పటి నుంచే ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులు పలు ప్రశ్నలు సంధించగా రేపు నామినేషన్ వేసిన తర్వాత అన్నింటికి సమాధానం చెబుతానని అన్నారు.
రాజకీయాల్లోకి రావాలన్నది మీ నిర్ణయమేనా? ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ప్రచారానికి వస్తారా? అని అడగ్గా రేపు అన్ని చెబుతానన్నారు. మీ రాజకీయ ప్రవేశానికి ఎన్టీఆర్ కుటుంబంలో అందరి ఆమోదం ఉందా అని ప్రశ్నించగా.. ‘అందరి ఆమోదం ఉండబట్టే నేను మీ ముందుకు వచ్చాన’ని సమాధానమిచ్చారు. అందరి ఆశీర్వాదం తనకు కావాలని కోరారు. సుహాసినితో పాటు ఆమె బాబాయ్ నందమూరి రామకృష్ణ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఆమెకు సీటు కేటాయించడం పట్ల స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన గళం విన్పిస్తున్నారు. (‘నందమూరి సుహాసినిని చిత్తు చిత్తుగా ఓడిస్తాం’)
Comments
Please login to add a commentAdd a comment