‘బీజేపీ అభ్యర్థుల జాబితా ఖరారు చేసిన కేసీఆర్‌’ | Ponnam Prabhakar Interesting Comments On KCR And Modi | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధం

Published Tue, Oct 9 2018 1:30 PM | Last Updated on Tue, Oct 9 2018 3:56 PM

Ponnam Prabhakar Interesting Comments On KCR And Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విభజన హామీలు ఏవి కూడా అమలు కాకపోయినా బీజేపీకి టీఆర్‌ఎస్‌ అన్ని విషయాల్లో సహకరించిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్‌కు వస్తున్నారని ప్రశ్నించారు. ఎక్కడ ఎన్నికలు  జరిగినా అమిత్‌ షా కంటే మందు ఏసీబీ, ఈడీ అధికారులు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ-టీఆర్‌ఎస్‌లు కావాలనే కాంగ్రెస్‌ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నాయని మండిపడ్డారు. 119 స్థానాలలో పోటీ చేయడానికి బీజేపీకి అభ్యర్థులే లేరని, అందుకే టికెట్లు రాని వేరే పార్టీలలోని సభ్యులను తమ పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవ చేశారు. తెలంగాణలో బీజేపీకి వంద స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు.  

ఉదయం తిట్టుకుంటారు.. సాయంత్రం..
ప్రధాని నరేంద్ర మోదీ-ఆపద్దర్మ సీఎం కేసీఆర్‌ ఇద్దరూ కలిసి పనిచేస్తున్న మాట వాస్తవమని, వారిద్దరి మధ్య ఫెవికాల్‌ బంధం ఉందని తెలిపారు. గతంలో గజ్వేల్‌ సభలో కేసీఆర్‌, నరేంద్ర మోదీ పరస్పరం పొగుడుకున్నారని గుర్తు చేశారు. ఇద్దరు పరస్పర అంగీకారంతోనే ఒకరిపైఒకరు విమర్శలు చేసుకోవడంలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పరిపాలనను కేంద్ర మంత్రులు అభినందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసినట్లేనని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థుల లిస్టు కూడా కేసీఆరే రెడీ చేసి అమిత్‌ షాకు పంపించారని ఆరోపించారు.

బీజేపీ-టీఆర్‌ఎస్‌ నేతలు ఉదయం తిట్టుకుంటారు.. సాయంత్రం కలుసుకుంటారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ గురించి బీజేపీకి కేసీఆర్‌ ముందే చెప్పారని, దానికి మోదీ-షాలు మద్దతిచ్చారని వివరించారు. తెలంగాణలో బలహీనవర్గాలకు చెందిన బండారు దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి కావాలని తప్పించారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణకు వచ్చిన లాభమేమిలేదని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడం ఖాయమని పొన్నం ప్రభాకర్‌ ధీమా వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement