కేసీఆర్‌ కుటుంబం పాలైన తెలంగాణ | Telangana Election Komatireddy Venkat Reddy Fair KCR Nalgonda | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కుటుంబం పాలైన తెలంగాణ

Published Fri, Nov 23 2018 10:34 AM | Last Updated on Fri, Nov 23 2018 10:34 AM

Telangana Election Komatireddy Venkat Reddy Fair KCR Nalgonda - Sakshi

ప్రచార సభలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ రూరల్‌ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆ ర్‌ కుటుంబం పాలైందని మా జీ మంత్రి, కాంగ్రెస్‌ మేనిఫె స్టో కమిటీ కో చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ మండలంలోని అన్నెపర్తి, అప్పాజిపేట, బుద్దారం, దీపకుంట, కంచనపల్లి, గుండ్లపల్లి, కుదావన్‌పూర్, దోనకల్, కొండారం, రాములబండ, దోమలపల్లి గ్రామాల్లో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆయా గ్రామాల్లో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్‌ మోసం చేశాడని, కేవలం కేసీఆర్‌ కుటుంబమే లబ్ధిపొందిందన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇంటింటికీ నల్లా ఇస్తామని అమలు చేయలేదన్నారు. కేసీఆర్‌ రూ.500 కోట్లుతో ఇల్లు నిర్మించుకున్నాడని, పేదల ఇండ్ల నిర్మాణం విస్మరించాడని ఆరోపించారు.

కేసీఆర్‌ చేసిన రుణమాఫీతో బ్యాంకర్లే బాగుపడ్డారని అన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో ఉద్యోగాలు తీసుకుని ప్రజలకు మాత్రం బర్లు, గొర్రు ఇచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి, తెల్లకార్డు ఉన్నవారందరికీ ఏడాదికి 6 సిలిండర్లు అందిస్తామన్నారు. వృద్ధులైన భార్య, భర్తలకు నెలకు రూ.2వేల పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. తాను తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు. ప్రజల కోసమే బతికే వ్యక్తినని.. మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పూర్తిచేసి చెరువులు నింపిస్తానని హామీ ఇచ్చారు. కాళేశ్వరానికి రూ.కోట్లు కేటాయిస్తున్న కేసీఆర్‌ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేశాడని విమర్శించారు. టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ అహం కారం తగ్గాలంటే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కేసీఆర్‌ మాయమాటలు ప్రజలు నమ్మే స్థితిల్లో లేరన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి భారీఎత్తున కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మహిళలతో కలిసి కోలాటం వేసి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, జెడ్పీటీసీ రాధ, నాయకులు వంగాల స్వామిగౌడ్, గుమ్మల మోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, గంగుల సైదులు, శంకర్‌గౌడ్, వెంకన్న, యాదగిరిరెడ్డి, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement