ఓటు.. అటా ఇటా? | Telangana Maharashtra Border Village People Confusion on Voting | Sakshi
Sakshi News home page

ఓటు.. అటా ఇటా?

Published Wed, Apr 3 2019 8:25 AM | Last Updated on Wed, Apr 3 2019 8:25 AM

Telangana Maharashtra Border Village People Confusion on Voting - Sakshi

ఓటరు గుర్తింపు కార్డులతో పరందోళి గ్రామస్తులు

ప్రతి ఎన్నికల్లో ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్రలో ఓటు వేసే అవకాశం ఉండే సరిహద్దులోని 12 వివాదాస్పద గ్రామాల ఓటర్లు ఈసారి మాత్రం ఒక చోటే ఓటు వినియోగించుకోగలరు. ఇప్పటి వరకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ మహారాష్ట్ర, ప్రస్తుత తెలంగాణలో వేర్వేరు దశల్లో ఉండడంతో మొదట పోలింగ్‌ ఏ రాష్ట్రంలో జరిగితే అక్కడ ఓటు వేసే వారు. ఆ తర్వాత మరోచోట  ఓటు హక్కు వినియోగించుకుని రెండుసార్లు ఓటు వేసే వారు. ఈసారి రెండు రాష్ట్రాల్లో మొదటి దశలోనే ఈ నెల 11న పోలింగ్‌ జరగనుంది. దీంతో మొదట ఎక్కడ వేస్తే అక్కడే ఓటు చెల్లుబాటు కానుంది. మొదట ఈ గ్రామస్తులు రెండుచోట్లా ఓటు వినియోగించుకుంటామని అధికారులకు విన్నవించారు.

ఈ విషయాన్ని ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఒకచోట మాత్రమే ఓటు వేసే అవకాశం ఉందని సీఈసీ స్పష్టం చేసింది. దీంతో గతంలో మాదిరిగా రెండుచోట్లా ఓటేసే వీల్లేకుండా పోయింది. అయితే ఈ గ్రామస్తులు మాత్రం తాము రెండుచోట్లా ఓటు వినియోగించుకుంటామని చెబుతున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఇక్కడి ఓటర్లకు తెలంగాణలోని ఆదిలాబాద్‌ లోక్‌సభ, అటు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ లోక్‌సభ పరి«ధిలో ఒక్కొక్కరికి రెండేసి ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికలతో పాటు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ రెండుచోట్లా ఓటు వినియోగించుకున్నారు.- ఆకుల రాజు, సాక్షి– ఆసిఫాబాద్‌

ముందు మాకే ఓటేయండి..
రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు పోలింగ్‌ ఉండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు తమకే ముందు ఓటెయ్యాలని గ్రామస్తులను కోరుతున్నారు. రెండు రోజుల క్రితం మండల కేంద్రం కెరమెరిలో ప్రచారానికి వచ్చిన ప్రస్తుత ఆదిలాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోడం నగేశ్‌ మొదట తమకే ఓటు వేయాలని గ్రామస్తులను కోరారు. అటు చంద్రాపూర్‌ లోక్‌సభ బరిలో బీజేపీ అభ్యర్థి, కేంద్ర సహాయ మంత్రి హన్సరాజ్‌ గంగారామ్‌ అహెరి, కాంగ్రెస్‌ నుంచి సంజయ్‌ వామన్‌రావు ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం రెండు ఈ నెల 11న జరిగే ఓటింగ్‌ కోసం పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, తెలంగాణ కొత్త పంచాయతీల ప్రకారం 4 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

ఏళ్లుగా తేలని పంచాయితీ
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ (1956) సమయంలో ప్రస్తుత కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలోని పరందోళి, అంతాపూర్, బోలాపటార్, ముకదంగూడ గ్రామ పంచాయతీల పరిధిలోని పన్నెండు ఆవాసాలు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా రాజురా విధానసభ నియోజకవర్గం జివితి తాలుకాలో ఉండేవి. అదే సమయంలో అప్పటి ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ కింద ఈ భూభాగం కొనసాగింది. అయితే పూర్వ ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ రికార్డుల్లో ఈ గ్రామాల వివరాలు లేకపోవడంతో మహారాష్ట్ర తొలిసారిగా 1987లో ఈ 12 ఆవాసాల్లోని పరందోళి, అంతాపూర్‌లను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం తెలపగా.. సరిహద్దు పరిష్కారానికి 1988లో ఇరు రాష్ట్రాలు కేకే నాయుడు కమిటీని ఏర్పాటు చేశాయి. స్థానిక స్థితిగతులు, ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయాల సేకరణ అనంతరం సాంస్కృతిక పరంగా మరాఠా ప్రభావం ఉన్నా.. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండడంతో ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవేనని కమిటీ తేల్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ 1995లో మొదటిసారిగా ఇక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది.

 ముకదంగూడ గ్రామం
తొలిసారి పరందోళి, అంతాపూర్‌కు ఏపీ నుంచి ఇద్దరు సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. అయితే మహారాష్ట్ర ఈ ఎన్నికలను అంగీకరించక.. మళ్లీ పంచాయతీ ఎన్నికలు జరిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి సర్పంచ్‌గా ఎన్నికైన కాంబ్లే లక్ష్మణ్‌ హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ భూభాగాలు ఉన్నాయని తేల్చింది. దీనిని సవాల్‌ చేస్తూ అప్పటి చంద్రాపూర్‌ కలెక్టర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉంది. అప్పటి నుంచి రెండు రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఒక్కో పంచాయతీకి రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరేసి సర్పంచులు ఎన్నికవుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా ఉండడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఒకసారి మహారాష్ట్రకు, మరోసారి తెలంగాణకు సర్పంచులుగా ఎన్నికవుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర పరందోళి గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా ఎన్నికైన కాంబ్లే లక్ష్మణ్‌ గతంలో తెలంగాణ తరఫున సర్పంచుగా పని చేశారు. మహారాష్ట్ర పరిధిలో రెండు పంచాయతీలు పరందోళి, అంతాపూర్‌ మాత్రమే ఉండగా, తెలంగాణలో మాత్రం వీటికి తోడు ముకుదంగూడ, బోలాపటార్‌ కొత్త పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి.

పథకాలు, ఫలాలన్నీ డబుల్‌
రెండు రాష్ట్రాలు ఈ గ్రామాలకు పోటాపోటీగా అన్ని పథకాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి అటు మహారాష్ట్ర నుంచి రేషన్‌ కార్డులు, ఓటరు కార్డులు ఇతర అన్ని రకాల పథకాలు ఇరు రాష్ట్రాల నుంచి పొందుతున్నారు. అంతేకాక తమ భూభాగం అనిపించుకునేందుకు రెండు ప్రభుత్వాలు పోటాపోటీగా స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాయి.  ప్రస్తుతం తెలంగాణ పరిధిలో నాలుగు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, మహారాష్ట్ర రెండు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండడంతో రోడ్డు సౌకర్యం లేక జనం అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామాలకు వెళ్లాలంటే ఉమ్రి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి ఒక్కటే దారి. అదింకా పూర్తికాక ఇబ్బందులు పడుతున్నారు. పోడు భూములు సాగు చేసే వారికి పట్టాలు లేక ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అందించే రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ తదితర పథకాలు బాగున్నాయని చెబుతున్నారు.

కొత్తగా రెండు పంచాయతీలు
ఈ సరిహద్దు వివాదాల్లో ఉన్న 12 గ్రామాల పరిధిలో మొదటి పరందోళి జీపీ పరిధిలో ముకదంగూడ, కోట, శంకర్‌ లొద్ది, లెండి జాల, పరందోళి తండా, మహారాజ్‌గూడ (ముకదంగూడ సగ భూ భాగం మహారాష్ట్రలో మిగతా భాగం ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉంది) ఉన్నాయి. రెండో గ్రామ పంచాయతీ అంతాపూర్‌ పరిధిలో బోలాపటార్, ఇంద్రానగర్, ఎస్సాపూర్, లెండిగూడ, గౌరి, నారాయణగూడ గ్రామాలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బోలాపటార్, ముకదంగూడను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.

గ్రామాలు:    12
జనాభా:    9 వేలు
ఓటర్లు:        2,663
సామాజిక వర్గాలు: మహర్, మాంగ్‌ (ఎస్సీ), లంబాడీ, ఆదివాసీ (ఎస్టీ), బీసీ.

రెండుచోట్లా అవకాశం కల్పించాలి
మేం రెండు రాష్ట్రాల్లో ఉన్నాం. మాకు రెండుచోట్లా గుర్తింపు కార్డులున్నందున రెండుచోట్లా ఓటు వేసే అవకాశం ఇవ్వాలి. గతంలో వేర్వేరు సమయంలో పోలింగ్‌ రావడంతో ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఒకేసారి రావడంతో ఎటు ఓటు వేయాలో తేల్చుకోలేకపోతున్నాం.    – కాంబ్లే లక్ష్మణ్‌ సర్పంచ్, పరందోళి (మహారాష్ట్ర) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement