ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నది బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎన్‌బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాల భవనం. సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఈ భవనంలో ఆరు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. నగరంలో ఇలా దాదాపు 57 భవనాల్లో ఆరుకు మించి పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో జనాభా ఎక్కువ. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే నగరంలో జనసాంద్రత అధికం కావడంతో ఎక్కడ చూసినా రద్దీ కనిపిస్తుంది. హోటళ్ల నుంచి సినిమాహాళ్ల దాకా, కూరగాయల దుకాణాల నుంచి సూపర్ మార్కెట్ల దాకా అంతటా జనమే. ఇక పెట్రోల్ బంకులు, బ్యాంకుల వంటి చోట్ల ఎడతెగని క్యూలు ఉంటూనే ఉంటాయి. ఓటర్లు కూడా అన్ని ప్రాంతాల్లో ఎక్కువ కావడంతో వారి సంఖ్యకు అనుగుణంగా ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1400 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున నిర్ణయించారు. ఇలా ఏర్పాటు చేసే ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కో భవనం చొప్పున అవసరం. కానీ అవి అందుబాటులో లేక ఒకే భవనంలో ఒకటి కంటే ఎక్కువ.. అంటే రెండు, మూడు పోలింగ్ కేంద్రాలను మించి.. ఆరు అంతకంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 3,979 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అవన్నీ కేవలం 1583 భవనాల్లోనే ఉన్నాయి.
⇔ఒక్కో భవనంలో ఆరు అంతకంటే అధికంగా పోలింగ్ కేంద్రాలున్న భవనాలు ముషీరాబాద్, ఖైరతాబాద్‌లలో ఎక్కువగా ఉన్నాయి. కంటోన్మెంట్‌లో మాత్రం ఒక్కచోటే ఇలాంటి పరిస్థితి ఉంది.
నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన భవనాలు,ఒకటి నుంచి ఆరు, అంతకు మించి పోలింగ్ కేంద్రాలున్న భవనాల వివరాలిలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment