పనే ప్రామాణికం | Upadi Hami Pathakam Process In Warangal | Sakshi
Sakshi News home page

పనే ప్రామాణికం

Published Wed, May 22 2019 12:42 PM | Last Updated on Wed, May 22 2019 12:42 PM

Upadi Hami Pathakam Process In Warangal - Sakshi

నల్లబెల్లిలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

నల్లబెల్లి: పల్లెల నుంచి పట్నాలకు వలసలను నివారించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విధితమే. గ్రామాల్లో వ్యవసాయం పనులు లేనప్పుడు కూలీలకు స్థానికంగానే పనులు కల్పించాలనేది ఈ పథక ఉద్దేశం. ఇప్పటివరకు పల్లెల్లో సత్ఫలితాలు ఇస్తూ వచ్చింది. అసలు సమస్య ఇక్కడే వచ్చింది.. పథకం ప్రారంభం నుంచి క్షేత్ర సహాయకులుగా పని చేసిన వారికి ప్రభుత్వం తాజాగా తీసుకొన్న నిర్ణయంతో ఆందో ళన చెందుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యూలర్‌తో ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనని దిగులుగా ఉన్నారు. సర్క్యూలర్‌ జారీ తర్వాత కూలీలకు కనీస పనిదినాలు ఖచ్చితంగా కల్పించాల్సిందే. లేదంటే సదరు ఫీల్డ్‌ అసిస్టెంట్లను తగ్గించడం, లేదా తొలగించేలా కఠిన చర్యలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. కనీస పనిదినాలు కల్పించని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను తొలగించాలని ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ సర్క్యూలర్‌ 9333 జారీ చేశారు. జిల్లాలో 264 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు పని చేస్తుండగా ఈ ఆదేశాలతో సుమారు 60 మందికి పైగా ఫీల్డ్‌  అసిస్టెంట్‌లపై వేటుపడే అవకాశాలున్నాయి.

చిన్న గ్రామాలకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేనట్టే..!
జిల్లాలో 15 మండలాల పరిధిలో 264 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ఉపాధి హామి పథకం ప్రారంభంలో గ్రామానికి ఒకరి చొప్పున ఫీల్డ్‌ అసిస్టెంట్లను నియమించారు. అయితే చిన్న గ్రామాలకు సైతం క్షేత్ర సహాయకులను నియమించడంతో ప్రభుత్వ ఉద్యోగమని భావించి ఉన్నత చదువులు ఆపేసి కొందరు.. ప్రైవేట్‌ ఉద్యోగాలు వదిలేసి మరికొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా చేరారు. పని అడిగిన కూలీలకు పనులు కల్పిస్తూ వస్తున్నారు. కాగా పని నిర్థారణ, కేటాయింపు, కూలీల విషయంల్లో పలు మార్పులు చోటు చేసుకోగా సరికొత్తగా కూలీల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతూ సర్క్యులర్‌ జారీ చేసింది. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధి హామి సిబ్బందిపై చర్యలు తీసుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇందులో భాగంగానే ప్రతి కుటుంబానికి 25 రోజులకు తగ్గకుండా పని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 40 రోజులకు పైగా పని కల్పించేలా నిర్ణయించి.. పని అడిగిన ప్రతి ఒక్కరికీ పనులు చూపించాలి. దినసరి ససగటు కూలి రూ.180 కంటే తగ్గకుండా చూడాలి. 100 శాతం జాబ్‌ కార్డులను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో మస్టర్‌రోల్‌ను నిర్వహించాలి. కూలీలకు పే స్లిప్‌లు తప్పకుండా పంపిణీ చేయాల్సి ఉంది. గ్రామాల్లో నర్సరీ పనులను తప్పకుండా పర్యవేక్షించాలి.

పని దినాలను బట్టే వేతనం..
ఉపాధి హామి పథకంలో పని అడిగిన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం జాబ్‌ కార్డు అందించింది. ప్రస్తుతం ఈ పథకంలో గ్రామాల్లో కూలీలకు కల్పించే పనిదినాలను బట్టి ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు వేతనాల చెల్లింపు అర్హత లిస్టులను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో జాబ్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఒక ఏడాదిలో 40 పనిదినాలు కల్పించాల్సి ఉంటుంది. ఆయా గ్రామ పంచాయతీల జాబితా 1, 2, 3 గా విభజించారు. సగటున 40 దినాల పనిచూపితే ఆ గ్రామ పంచాయతీ లీస్టు–1 అర్హత పొందుతుంది. ఈ గ్రామపంచాయతీల్లో పనిచేసే ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు నెలకు వేతనం రూ.10 వేలు అందిస్తారు. 25 నుంచి 40 రోజుల మధ్యలో పని కల్పిస్తే లీస్టు–2 గ్రామపంచాయతీగా పరిగణిస్తారు. వీరికి రూ.5 వేల వేతనం అందిస్తారు. 25 రోజులలోపు పని దినాలు కల్పిస్తే లిస్ట్‌–3 గ్రామ పంచాయతీగా పరిగణిస్తారు. ఇక్కడ సీనియర్‌ మేట్‌తో పనులు నిర్వహిస్తారు. 2018 జూలై 1 నుంచి 2019 జూన్‌ 30 వరకు ఆయా గ్రామపంచాయతీల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు కల్పించిన పని దినాలను లెక్కించి కుటుంబాల వారీగా విభజించి వారిని లిస్ట్‌–1, 2, 3 గా విభజించనున్నారు. ఈ నిబంధనలతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆందోళన చెందుతున్నారు.

నిబంధనలు పాటించాల్సిందే
ఉపాధి హామి పథకానికి సంబంధించి ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పాటించాల్సిందే. కూలీలకు ఎ క్కువ పనిదినాలు కల్పించాలనే లక్ష్యం తో ప్రభుత్వం ఈ నిబంధనలు తీసుకొ చ్చింది. దానికి అనుగుణంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనిచేయాల్సి ఉంటుంది. పనులకు సక్రమంగా రాని ఉపాధి కూలీల జాబ్‌ కార్డులను రద్దుచేసే అవకాశాలు ఉన్నాయి. – పంజ వెంకట్‌నారాయణ, ఏపీఓ, నల్లబెల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement