![Vellampalli Srinivas Fires On Pawan Kalyan - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/17/Vellampalli-Srinivas.jpg.webp?itok=ymd3kO3l)
సాక్షి, విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు నిలకడ, నిబద్ధత లేవని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. బీజేపీతో పొత్తు అందుకు నిదర్శనమన్నారు. డబ్బులు తీసుకుని రాజకీయాలు చేసే పవన్ లాంటి నాయకుడిని తనెక్కడా చూడలేదని చెప్పారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అన్నం పెట్టిన అన్నను వదిలేసిన వ్యక్తి పవన్ అని అన్నారు. చిరంజీవి విజ్ఞతతలో ఆలోచిస్తారని.. పవన్ మాత్రం ఎవరు డబ్బులిస్తే వారికి వంతపాడతారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉండగా ఒకమాట.. ఇప్పుడు మరోమాట మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్‌కు సిద్ధాంతాలు, సొంత ఆలోచన, సొంత స్క్రిప్టు ఉండవని.. ఆయనకు పర్మినెంట్ నిర్మాత, డైరక్టర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ బీజేపీ ముసుగు ధరించారని ఆరోపించారు.
బీజేపీ పాచిపోయిన లడ్డులు ఇచ్చిందన్న పవన్.. ఇప్పుడేందుకు పొత్తుపెట్టుకున్నాడో సమాధానం చెప్పాలన్నారు. పవన్ బీజేపీని ప్రత్యేక హోదా కోసం ఎందుకు నిలదీయడం లేదని సూటిగా ప్రశ్నించారు. పవన్‌ది కుటుంబసభ్యులను కూడా కలుపుకుపోలేని మనస్తత్వం అని విమర్శించారు. పవన్ త్వరలోనే జనసేనను బీజేపీలో విలీనం చేస్తారని వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలు పవన్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పూటకో మాట మాట్లాడే పవన్‌ని నమ్మితే.. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని జోస్యం చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ చేస్తున్న గేమ్ ప్లాన్ ఫలించదని అన్నారు. రాష్ట్ర ప్రజలు సంక్షేమ సారథి అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment