విజయనగరం జిల్లా ఎస్‌కోట నియోజకవర్గం కొట్యాడ వద్ద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్ర సాగిస్తున్న చెల్లెమ్మలు
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. రుణ మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మాతో ఓట్లు వేయించుకున్నాడు. అధికారంలోకి వచ్చాక ఆ మాట నిలుపుకోలేదు. పైగా ఇప్పుడేమో అప్పులన్నీ మాఫీ చేశామంటున్నాడు. ఎక్కడ, ఎవరికి మాఫీ చేశారో మాకైతే తెలీదు. ఆయన పుణ్యమా అని కొత్త అప్పులు పుట్టడం లేదు. పాత అప్పు తడిసి మోపెడైంది. సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదు. ఆయన్ను నమ్మి నిండా మునిగాం.. అప్పుల పాలయ్యాం’ అని పలువురు మహిళలు.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఈసారి మా ఓట్లన్నీ మీకేనని, మిమ్మల్ని సీఎం చేస్తేనే కష్టాలు తీరతాయన్నారు.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 272వ రోజు గురువారం ఆయన విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలోని కొట్యాడ గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. దారిపొడవునా జనం పెద్ద సంఖ్యలో జననేతకు స్వాగతం పలికారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు, రైతులు, యువతీ యువకులు గుంపులు గుంపులుగా వచ్చి జననేతను కలుసుకున్నారు. తమ గ్రామం గుండా జననేత వెళుతున్నాడని తెలుసుకుని ఆయా గ్రామాల ప్రజలు ఓ పండుగకు సిద్ధమైనట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు.
ఆ పూట తమ పనులకు స్వస్తి చెప్పి గ్రామాల్లోనే ఉండిపోయారు. జామి మండల కేంద్రంలోని యల్లమాంబ ఆలయానికి ఓ ప్రాశస్త్యం ఉంది. ప్రతి ఏటా మార్చి – ఏప్రిల్ నెలలో అక్కడ యల్లమాంబదేవి తీర్థం జరిగినప్పుడు పెద్ద సంఖ్యలో జనం వచ్చి మొక్కులు తీర్చుకోవడం పరిపాటి. గురువారం జగన్ యాత్రకు కూడా అదే స్థాయిలో జనం వచ్చారని స్థానికులు చెబుతున్నారు. బలహీనవర్గాల వారు అధికంగా ఉండే చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా జగన్‌ను చూడాలని జనం తరలి వచ్చారు.
రుణాలు మాఫీ కాలేదన్నా..
డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికలప్పుడు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మహిళలు జగన్ ఎదుట వాపోయారు. దీనివల్ల తమకు మునుపటిలా సున్నా వడ్డీకి రుణాలు రావడం లేదని ఫిర్యాదు చేశారు. తమకు అన్ని అర్హతలున్నా పింఛన్లు ఇవ్వడం లేదని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వస్తున్న పింఛన్లను కూడా రద్దు చేశారని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సుదీర్ఘకాలం పాటు తమకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, గ్రామాల్లో మూడు నాలుగు రోజులకు ఒకసారి కూడా మంచినీరు రావడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేషన్‌షాపుల్లో గతంలో చాలా సరుకులు ఇచ్చే వారని, ఇప్పుడు బియ్యం తప్ప ఏమీ లేవంటున్నారని జగన్ దృష్టికి తెచ్చారు. వ్యవసాయ కూలీలకు ఇచ్చే రేట్లు, ఎరువుల ధరలు పెరిగినా, తాము పండించే పంటలకు మాత్రం కనీస మద్దతు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సాలూరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తన నియోజకవర్గంలోని మాజీ సర్పంచ్‌లు, మండల, నియోజకవర్గ స్థాయి నేతలను పార్టీలో చేర్పించారు. వీరంతా ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీలో ఉన్నారు.
వైఎస్సార్ దయతో ఇల్లు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దయతో పక్కా ఇల్లు నిర్మించుకున్నాను. అంతకు ముందు ఉండడానికి సొంత గూడు లేక అవస్థలు పడ్డాము. కుటుంబమంతా కలిసి పూరింట్లో ఉండేవాళ్లం. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి మా సొంత ఇంటి కలను నెరవేర్చారు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌మోహన్ రెడ్డి మా గ్రామం మీదుగా పాదయాత్రగా వెళ్తుండడంతో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు చెప్పాను. – సూరెడ్డి గంగమ్మ, జట్టేటి వలస, జామి మండలం
నాకు ఫించను ఆపేశారయ్యా..
అయ్యా.. నాది రామభద్రపు అగ్రహారం. మీ నాన్నగారి హయాంలో నాకు రూ.200 పింఛన్ మంజూరైంది. ఏ ఆధారం లేని నాకు నాలుగేళ్ల క్రితం పింఛన్ ఆపేశారు. భార్య కూడా చనిపోయింది. పదెకరాల భూమి ఉన్న వారికి కూడా పింఛను అందిస్తున్నారు. గ్రామంలో నా లాంటి పేదలకు పింఛన్లు అందించడానికి రాజకీయం చేస్తున్నారు. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేదు. నువ్వు అధికారంలోకి వస్తేనే మళ్లీ నాకు పింఛన్ వస్తుందయ్యా.. – కిర్ల వద్ద జగన్‌తో దువ్వు దేముడు
మినీ అంగన్‌వాడి కార్యకర్త పోస్టు అమ్ముకున్నారు
మా ఊరు సోంపురం. మా గ్రామానికి సంబంధించిన మినీ అంగన్‌వాడి కార్యకర్త పోస్టుకు 20 మంది దరఖాస్తు చేశారు. నా భార్య అప్పల సూర్యనారాయణమ్మ కూడా దరఖాస్తు చేసింది. ఆమె డిగ్రీ చదివింది. రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ అభ్యర్థికి ఇవ్వాల్సిన పోస్టును టీడీపీ నాయకులు బీసీ అభ్యర్థికి కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారాయి. అధికారులకు విషయం తెలియజేసినా పట్టించుకోలేదు. – గుర్రం సంతోష్
Comments
Please login to add a commentAdd a comment