సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:పరిపాలనలో పారదర్శకత, నమ్మినవారికి సముచిత స్థానం, అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం, పార్టీ ఆవిర్భావం నుంచి అందించిన సేవలు... ఇలా అన్ని అంశాల్లో నెగ్గుకొచ్చినవారికి తగిన గుర్తింపు లభించింది. అఖండ విజయంతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత పదవుల ఎంపికలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తన మంత్రివర్గంలో సీనియరు నాయకుడు, నరసన్నపేట ఎమ్మెల్యేధర్మాన కృష్ణదాస్‌కు చోటుకల్పించనున్నారు. శుక్రవారం శాసనసభాపక్ష సమావేశం తర్వాత ఆయన పేరు దాదాపుగా ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శనివారం గవర్నరు ఎన్.నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. అలాగే జిల్లాలో మరో సీనియరు నాయకుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం శాసనసభ స్పీకరుగా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాలో రెండు ప్రధా న సామాజికవర్గాలకు చెందిన సీనియరు నాయకులకు ఉన్నత పదవులు దక్కడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో ఆనందం వ్యక్తమవుతోంది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేసి మిగతా సామాజిక వర్గాల నాయకులకు న్యాయం చేస్తానని జననేత జగన్ ముందుగానే స్పష్టం చేశారు. ఈ ప్రకారం జిల్లాలో మరికొందరు నాయకులకు ఆ సందర్భంలో మంత్రిమండలిలో స్థానం లభించే అవకాశం ఉంది.
ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావు సోదరుల్లో ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ధర్మాన ప్రసాదరావు ఇప్పటికే నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి, నల్లారు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో కీలక శాఖలు నిర్వహించారు. ఇప్పుడు ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌కు నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో చోటు లభించింది. ప్రస్తుతం జిల్లా నుంచి ఒకే ఒక్కరికి అవకాశం ఇస్తున్న దృష్ట్యా కేబినెట్‌లో కీలకమైన శాఖ లభించొచ్చనే ఊహాగానాలు విని పిస్తున్నాయి. కృష్ణదాస్ 2004, 2009 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున నరసన్నపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక చని పోయినవారి కుటుంబాలను ఓదార్చేందుకు అనుమతి ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటుచేసినప్పుడు జిల్లా నుంచి కృష్ణదాస్ ఆయన బాటలో నడిచారు. తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారు. 2012 ఉప ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ తొలి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అలాగే పార్టీలో, బీసీ సంఘంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలి ఎన్నికలలోనూ భారీ మెజార్టీతో నరసన్నపేట నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మంచి వాగ్ధాటి, సమయస్ఫూర్తి ఉన్న నాయకుడిగా పేరున్న తమ్మినేని సీతారాం గతంలో టీడీపీలో ఉన్నప్పుడు సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ఆమదాలవలస నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన ఆయనకు శాసనసభాధిపతిగా అవకాశం లభించింది. సీనియరు నాయకుడిగా అసెంబ్లీని సమర్థంగా నడిపించగల సామర్థ్యం ఆయనకు ఉంది. ఆయనకు ఉన్నతమైన పదవి లభించడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు చెందిన తంగి సత్యనారాయణ, కావలి ప్రతిభాభారతి స్పీకరుగా పనిచేశారు. నూతన ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా నుంచి తమ్మినేనినే ఆ పదవి వరించింది.
మంత్రి పీఠంపై దాసన్న
వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు.. ఎమ్మెల్యే పదవిని త్యజించి నాయకుడి వెంట నడిచారు.. ప్రజల అండదండలతో ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించారు.. గత తొమ్మిదేళ్లుగా దాసన్న ఎదుర్కొన్న ఒడిదొడుకులకు, అలుపెరుగని పోరాటానికి గుర్తింపుగా ఇప్పుడు మంత్రి పదవి లభించింది. అంకిత భావానికి, నిష్కల్మషమైన ఆయన మనసుకు అధినేత నుంచి లభించిన అరుదైన బహుమతి ఇది.
అధ్యక్షా.. అభినందనలు
అనుభవానికి తగిన గుర్తింపు.. పదేళ్లుగా పార్టీకి అందించిన సేవలకు ప్రతిఫలం.. ఆరుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన తమ్మినేని సీతారాంను అసెంబ్లీ స్పీకర్ పదవి వరించిన వేళ సర్వత్రా అభినందనలు.. న్యాయశాస్త్ర పట్టభద్రుడు కావడం, ఎన్నో ముఖ్యమైన శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం తమ్మినేనికి కలిసివచ్చింది.
సీతారాం, కృష్ణదాస్‌కు అభినందనలు
కాశీబుగ్గ, కంచిలి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్‌కు మంత్రి పదవి, ఆమదాలవలస ఎమ్మెల్యే సీతారాంకు అసెంబ్లీ స్పీకర్ పదవులు వరించాయి. తమపై నమ్మకంతో పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు వారిని అభినందించారు. పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, పార్టీ నేతలు పేరాడ తిలక్, పిరియా సా యిరాజ్‌లతోపాటు టెక్కలి, ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల నాయకులు అమరావతిలో వా రిని కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా ప్ర జల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.
కృష్ణదాస్ ప్రస్థానం ఇలా...
జననం: 1954 జూలై 7
తల్లిదండ్రులు: ధర్మాన రామలింగం నాయుడు, సావిత్రమ్మ
స్వస్థలం: నరసన్నపేట నియోజకవర్గంలో పోలాకి మండలంలోని మబగాం
విద్య: బీకాం
భార్య: ధర్మాన పద్మప్రియ (సారవకోట మండలం జడ్‌పీటీసీ సభ్యురాలు)
పిల్లలు: ధర్మాన రామలింగం నాయుడు (బీటెక్), డాక్టరు ధర్మాన కృష్ణచైతన్య (ఎండీ రేడియాలజీ)
ఉద్యోగం: విశాఖపట్నం స్టీలుప్లాంటులో పనిచేశారు.
రాజకీయం: నరసన్నపేట నియోజకవర్గం నుంచి 2004, 2009, 2012లో వరుసగా హ్యాట్రిక్ విజయం నమోదుచేశారు. 2019లో నాలుగోసారి గెలుపొందారు.
తమ్మినేని రాజకీయ ప్రస్థానం...
జననం: 1955
తల్లిదండ్రులు: తమ్మినేని శ్రీరామమూర్తి, ఇందువతమ్మ
స్వస్థలం: ఆమదాలవలస నియోజకవర్గంలోని తొగరాం
విద్య: డిగ్రీ
భార్య: వాణిశ్రీ
పిల్లలు: నాగినీ విజయలక్ష్మి, చిరంజీవినాగ్ (వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
రాజకీయం: 1980లో ఆమదాలవలస చక్కెర కర్మాగారం డైరెక్టరుగా ఎన్నికై తమ్మినేని రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1983 నుంచి వరుసగా ఆరుసార్లు (1983, 1985, 1991, 1994, 1999, 2019) ఆమదాలవలస ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా, పలు కీలక శాఖల మంత్రిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment