అంచనాలను అందుకుంటా!
లాహ్లి (రోహ్‌టక్): వెస్టిండీస్‌తో జరిగే తన వీడ్కోలు సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. తన అభిమానులు, ఆప్తుల అంచనాలను అందుకోగలననే నమ్మకం ఉందని అతను చెప్పాడు. ‘వెస్టిండీస్ జట్టు కూడా పటిష్టంగానే ఉంది కాబట్టి సిరీస్ బాగా జరగొచ్చు
. నా చివరి రెండు టెస్టుల కోసం ఎదురు చూస్తున్నాను. చక్కటి క్రికెట్ ఆడి నా అభిమానులు, శ్రేయోభిలాషుల అంచనాలను అందుకోగలనని నమ్ముతున్నాను’ అని మాస్టర్ వ్యాఖ్యానించాడు. ముంబై జట్టు గెలుపు పట్ల సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ వికెట్‌పై పరుగులు అంత సులభంగా రాలేదని రంజీ మ్యాచ్‌ను విశ్లేషించాడు. ‘ఇది క్లిష్టమైన వికెట్. పరుగులు సునాయాసంగా దక్కలేదు. అయితే బౌలర్లకు అనుకూలించే పిచ్‌పై బ్యాటింగ్ చాలా సరదాగా అనిపించింది.
అవుట్‌ఫీల్డ్ కూడా నెమ్మదిగా ఉండటంతో 240 పరుగుల లక్ష్యం కూడా 280గా కనిపించింది. నేను అనుకున్న తరహాలో ఆడగలిగాను’ అని సచిన్ పేర్కొన్నాడు. తనతో కలిసి ఆడే కుర్రాళ్లకు సహజంగానే సూచనలు ఇస్తానని, ఈ మ్యాచ్‌లోనూ అదే చేశానని సచిన్ చెప్పాడు. ‘నాన్‌స్ట్రైకర్ ఎండ్ నుంచి నేను పరిశీలించిన వాటిని ఆటగాళ్లతో పంచుకుంటాను. అంతకుమించి మరేమీ ప్రత్యేకంగా లేదు. ప్రతీసారి అది పని చేయకపోవచ్చు కానీ అది కూడా సరదాగా అనిపిస్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటే తీవ్ర ఒత్తిడి మధ్య కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది’ అని ఈ ముంబై దిగ్గజం అన్నాడు.