నరైన్‌కు బీసీసీఐ షాక్!
⇒ ఆఫ్ బ్రేక్ బంతులు వేయకుండా నిషేధం
⇒ ఇతర బంతులు వేసేందుకు అనుమతి
న్యూఢిల్లీ: వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్ శైలిపై బీసీసీఐ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా అతనిపై షరతులతో కూడిన నిషేధాన్ని విధించింది. ఇకపై బోర్డు నిర్వహించే టోర్నీలలో అతను ఆఫ్ స్పిన్ బంతులు వేయరాదని ఆదేశించింది. ఇటీవల విశాఖపట్నంలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ నరైన్ యాక్షన్‌పై అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ నియమావళిలోని రూల్ 24.2ను అతను ఉల్లంఘిస్తున్నాడని వారు తేల్చారు. దాంతో అతను చెన్నైలోని బయోమెకానికల్ కేంద్రానికి వెళ్లి దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో నరైన్ ఆఫ్ బ్రేక్ బంతులు మాత్రం నిబంధనలకు అనుగుణంగా లేవని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఆఫ్ బ్రేక్ బంతులు కాకుండా ఇతర రకాల వైవిధ్యమైన బంతులతో అతను ఐపీఎల్‌లో బౌలింగ్ కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. కానీ మరోసారి నరైన్ యాక్షన్ సందేహంగా ఉంటే అంపైర్లు దానిని నోబాల్‌గా ప్రకటించి తదుపరి చర్యలకు సిఫారసు చేయవచ్చు.
కెరీర్‌కు దెబ్బ...
గత ఏడాది చాంపియన్స్ లీగ్ సందర్భంగా నరైన్ ‘దూస్రా’పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీసీసీఐ అతనిపై నిషేధం విధించింది. ‘చకింగ్’ భయంతోనే అతను స్వచ్ఛందంగా వన్డే ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత యాక్షన్ మార్చుకొని ఐపీఎల్ బరిలోకి దిగినా... పాత నరైన్ కనిపించలేదు. ఎక్కడ యాక్షన్‌ను తప్పు పడతారేమోననే ఆందోళన, ఒత్తిడి అతనిలో తొలి మ్యాచ్ నుంచే కనిపించాయి. ఫలితంగా అతను ఏ మాత్రం ప్రభావం చూపలేకపోగా, బ్యాట్స్‌మెన్ అలవోకగా ఎదుర్కొన్నారు. ఐదు మ్యాచ్‌లలో కలిపి నరైన్ 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.
ఒక ఆఫ్‌స్పిన్నర్‌ను సాంప్రదాయ ఆఫ్ స్పిన్ బంతులు వేయరాదని నిషేధం విధిస్తే అతను ఇంకేం బౌలింగ్ చేయగలడు! నరైన్ వెస్టిండీస్ టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడు కాదు. వన్డేలతో పాటు టి20 లీగ్‌లలో ఆడుతున్నాడు. మరో వైపు సయీద్ అజ్మల్‌ది కూడా దాదాపు ఇదే స్థితి. యాక్షన్‌పై సందేహం వ్యక్తం చేసిన తర్వాత నెలలపాటు శ్రమించి సరిదిద్దుకున్నాడు. కానీ బౌలింగ్‌లో పదును పోయింది.
తొలి వన్డేలో బంగ్లాదేశ్‌తో కూడా వికెట్ తీయకుండా 74 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో తొలి టెస్టులో అతడిని జట్టులోకే తీసుకోలేదు. ఈ ఇద్దరూ ‘మిస్టరీ బౌలర్లు’గా ప్రపంచ క్రికెట్‌పై తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు పదే పదే ‘చకింగ్’ ఆరోపణలు వీరి కెరీర్‌కు దురదృష్టకర ముగింపు పలికే అవకాశం ఉంది!