భారత్ ఖాతాలో కాంస్యం
అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ
ఇపో (మలేసియా): ఆతిథ్య దేశం మలేసియా చేతిలో చివరి లీగ్ మ్యాచ్‌లో అనూహ్య ఓటమితో పసిడి పోరుకు అర్హత పొందలేకపోయిన భారత్... సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. న్యూజిలాండ్ జట్టుతో శనివారం జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (17వ, 27వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ఎస్‌వీ సునీల్ (48వ నిమిషంలో), తల్విందర్ సింగ్ (60వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. 34 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత్ కాంస్య పతకం సాధించడం ఇది ఏడోసారి.
గతంలో భారత్ 1983, 2000, 2006, 2007, 2012, 2015లో కాంస్య పతకాలు గెలిచింది. మరోవైపు ఫైనల్లో బ్రిటన్ 4–3తో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టును ఓడించి విజేతగా నిలిచింది. 1994 తర్వాత బ్రిటన్ ఈ టోర్నీలో టైటిల్ సాధించడం విశేషం. ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో మలేసియా 3–1తో జపాన్‌ను ఓడించి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. జపాన్‌కు చివరిదైన ఆరో స్థానం లభించింది.