సెమీఫైనల్లో నిధి
ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ
చెన్నై: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిధి చిలుముల సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక్కడి మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఏడో సీడ్ నిధి 6-3, 6-0తో జియావో వాంగ్ (చైనా)పై విజయం సాధించింది.
మరోవైపు రిషిక సుంకర 7-6 (7/3), 1-6, 0-6 స్కోరుతో మన దేశానికే చెందిన ఇతీ మెహతా చేతిలో పరాజయం పాలైంది. ఇతర మ్యాచ్ల్లో నటాషా (భారత్) 6-0, 6-2తో హిరోనో వాంతనబేపై, ప్రార్థన (భారత్) 6-4, 6-2తో వాంగ్టీన్చాయ్ (చైనీస్ తైపీ)పై గెలిచి సెమీస్కు చేరుకున్నారు.
డబుల్స్ విభాగం సెమీఫైనల్లో నిధి జోడికి చుక్కెదురైంది. నిధి-వాంగ్ (చైనా) జోడీ 2-6, 3-6తో నటాషా-ప్రార్థన జోడి చేతిలో ఓటమి పాలైంది. అయితే రిషిక సుంకర-షర్మద ద్వయం 6-3, 6-1 (10/5)తో వాంతనబే-వాంగ్టీన్చాయ్ ద్వయంను ఓడించి తుది పోరుకు సిద్ధమైంది. నేటి సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్లో ప్రార్థనతో నిధి తలపడనుంది.