మాంచెస్టర్ : ప్రపంచకప్‌లో గత మ్యాచ్ తాలూకు పరాజయాలు నాకౌట్‌లో తమ జట్టును ప్రభావితం చేయలేవని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియెల్ వెటోరి అభిప్రాయపడ్డాడు. మంగళవారం నాటి సెమీస్ మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించినట్లైతే కోహ్లి సేనను సులువుగా కట్టడి చేయవచ్చని బ్లాక్ క్యాప్స్‌కు సూచించాడు. బ్యాట్ లేదా బంతితో మొదటి పది ఓవర్లలో దూకుడు ప్రదర్శించినట్లైతే కివీస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. టీమిండియాను భారీ తేడాతో మట్టికరిపించిన ఇంగ్లండ్ జట్టును స్ఫూర్తిగా తీసుకుని సెమీస్‌లో దూకుడు ప్రదర్శించాలని విలియమ్సన్ సేనకు సూచించాడు. ఇంగ్లండ్ తరహాలో మ్యాచ్ ఆది నుంచి టీమిండియా బౌలర్లపై విరుచుకుపడితే విజయం వరించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం మెగాటోర్నీ తుది దశకు చేరిన క్రమంలో అందరి కళ్లూ భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న తొలి సెమీస్‌పైనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వెటోరీ మాట్లాడుతూ..‘ న్యూజిలాండ్ ఔట్‌సైడర్‌గానే సెమీస్‌లో అడుగుపెట్టింది. బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఏది ఎదురైనా సరే నాకౌట్‌లో తొలి పది ఓవర్లను ఘనంగా ఆరంభిస్తే చాలు. అలా అయితే గత మూడు మ్యాచ్‌ల్లో ఓడామనే నైరాశ్యం ఇట్టే ఆవిరైపోతుంది. జట్టుగా సమిష్టిగా పోరాడలేకపోతున్నాం అనుకున్న సమయంలో వ్యక్తిగతంగా మెరుగ్గా రాణించడంపై దృష్టి పెట్టాలి. అలా ప్రతీ ఒక్కరు అనుకుంటే టీమ్ మొత్తం ఉత్తేజంతో నిండిపోతుంది. కావాలంటే శనివారం నాటి దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను చూడండి. వరల్డ్‌కప్ ఆరంభం నుంచి సవాళ్లను ఎదుర్కొన్న ప్రొటీస్ జట్టు చివరి మ్యాచ్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి టోర్నీ నుంచి నుంచి గౌరవంగా నిష్క్రమించింది. అదే విధంగా ఎడ్జ్‌బాస్టన్ మ్యాచ్‌లో టీమిండియాపై ఇంగ్లండ్ ఘన విజయాన్ని గుర్తు చేసుకోండి. హార్ధిక్ పాండ్యా, షమీని వారు సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు గమనించండి. విలియమ్సన్, రాస్ టేలర్ ఫామ్‌లో ఉండటం కివీస్‌కు కలిసి వచ్చే అంశం’ అని తమ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు.
ఇక గతంలో ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. నాలుగు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయం దక్కింది. ఈ రెండు జట్లు 2003 తర్వాత మళ్లీ ఓ ప్రపంచకప్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుండటం విశేషం. 2003 ప్రపంచకప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఏడు వికెట్లతో గెలిచింది. కాగా ప్రస్తుత ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో ఒకే ఒక ఓటమి మినహా ఏడు సాధికారిక విజయాలతో సెమీస్ చేరిన జట్టు మనదైతే... పాక్‌తో సమానంగా ఐదు విజయాలే సాధించినా, వరుసగా గత మూడు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత కూడా రన్‌రేట్ రూపంలో అదృష్టం కలిసొచ్చి ముందంజ వేసిన టీమ్ న్యూజిలాండ్. బలబలాల పరంగా ప్రత్యర్థి కంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తున్న కోహ్లి సేనకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఐసీసీ టోర్నీలో అనూహ్య ప్రదర్శన కనబర్చడం అలవాటుగా మార్చుకున్న కివీస్ అంత సులువుగా లొంగుతుందా? అనేది నేటితో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment