'అప్పటికి ధోనీ కెప్టెన్గా ఉండకపోవచ్చు'
న్యూఢిల్లీ: అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. తన సారథ్యంలో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అయితే మూడేళ్లుగా ధోనీ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్పై పూర్తిగా దృష్టిసారించేందుకుగాను 2014లో టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. అతడి స్థానంలో యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి జట్టు పగ్గాలు అప్పగించారు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ మహీ మునుపటి మాదిరిగా జట్టును విజయపథంలో నడపలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ కెప్టెన్సీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2019లో ఇంగ్లండ్లో జరిగే వన్డే ప్రపంచ కప్ నాటికి ధోనీ కెప్టెన్గా ఉండకపోవచ్చని అన్నాడు. అప్పటివరకు సెలెక్టర్లు అతడినే కెప్టెన్గా కొనసాగిస్తే ఆశ్చర్యమేనని చెప్పాడు.
వచ్చే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని భారత సెలెక్టర్లు కెప్టెన్సీ విషయంపై సముచిత నిర్ణయం తీసుకోవాలని దాదా కోరాడు. వన్డే జట్టు కెప్టెన్ పదవికి కోహ్లీ పేరును సూచించాడు. 'ధోనీ 9 ఏళ్లుగా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అతను అద్భుతమైన కెప్టెన్. అయితే మరో నాలుగేళ్ల వరకు జట్టుకు కెప్టెన్సీ వహించే సామర్థ్యం మహీకి ఉంటుందా? క్రికెట్ నుంచి అతను వైదొలగాలని నేను చెప్పడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు ధోనీ అవసరముంది. అతను క్రికెట్లో కొనసాగాలి. అయితే 2019 వరకు అతను కెప్టెన్గా ఉంటాడని నేను భావించడం లేదు. కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. టెస్టు కెప్టెన్గా అతని రికార్డు బాగుంది. మైదానంలో కోహ్లీ దృక్పథం సూపర్. ఆటలోనే కాదు మానసికంగా కూడా శక్తిమంతంగా కనిపిస్తాడు. కాబట్టి వచ్చే వరల్డ్ కప్నకు ఎవరు కెప్టెన్గా ఉండాలన్నది సెలెక్టర్లు నిర్ణయించుకోవాలి' అని దాదా అన్నాడు.