లక్నో : వెస్టిండీస్, ఆప్ఘనిస్తాన్ క్రికెటర్లు బస చేసిన హోటళ్ల వైపు కన్నెత్తి చూడని జనం ఇరు జట్ల మధ్య జరిగే వన్డే మ్యాచ్‌లను చూసేందుకు వచ్చిన ఆప్ఘన్ అభిమానిని మాత్రం చూసేందుకు క్యూ కడుతున్నారు. 8.2 అడుగుల పొడవున్న షేర్ ఖాన్‌ను చూసేందుకు ఆయన బస చేసిన హోటల్‌కు జనం పోటెత్తారు. అత్యంత పొడగరి షేర్ ఖాన్‌కు ఆయన ఎత్తు కారణంగా పలు హోటళ్లు రూం ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో విసుగుచెందిన షేర్ ఖాన్ పోలీసుల సాయం కోరగా వారు హోటల్ రాజధానిలో రూం ఇప్పించారు. కాబూల్‌కు చెందిన అత్యంత పొడగరి ఖాన్‌ను చూసేందుకు హోటల్ వెలుపల వందలాది మంది గుమికూడారు. పొడగరిని చూసేందుకు దాదాపు 200 మందికి పైగా వచ్చారని, దీంతో షేర్ ఖాన్ డిస్ట్రబ్ అయ్యారని హోటల్ యజమాని రణు చెప్పారు. హోటల్ వెలుపల జనం పెద్దసంఖ్యలో గుమికూడటంతో ఆప్ఘన్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం ఆయనను పోలీసులు ఎస్కార్ట్‌గా నిలిచి స్టేడియంకు తీసుకువెళ్లారు. మరో నాలుగైదు రోజులు షేర్ ఖాన్ నగరంలో ఉంటారని హోటల్ యజమాని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment