భారత్‌కు తొలి పరాజయం
ఆస్ట్రేలియా చేతిలో 1–3తో ఓటమి
అజ్లాన్ షా హాకీ టోర్నీ
ఐపో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్‌షా కప్ హాకీ టోర్నీలో భారత్‌కు తొలి పరాజయం ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 3–1తో భారత్‌ను కంగుతినిపించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (26వ ని.) ఫీల్డ్ గోల్ చేయగా, ఆస్ట్రేలియా జట్టుకు ఎడీ ఒకెండెన్ (30వ ని.), టామ్ క్రెయిగ్ (34వ ని.), టామ్ విక్‌హమ్ (51వ ని.) తలా ఒక ఫీల్డ్ గోల్ సాధించిపెట్టారు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ ఆసీస్ దూకుడుతో మొదలైనా... భారత డిఫెండర్లు ఎక్కడికక్కడ నిలువరించడంలో సఫలమయ్యారు. తొలిక్వార్టర్‌లో భారత గోల్‌పోస్ట్‌పై గురిపెట్టిన దాడుల్ని చాకచక్కంగా అడ్డుకున్నారు. భారత ఆటగాళ్ల ప్రయత్నాలను ఆసీస్ ఆటగాళ్లు అడ్డుకోవడంతో తొలి క్వార్టర్ గోల్ లేకుండానే ముగిసింది. ఇక రెండో క్వార్టర్‌లో కూడా భారత ఆటగాళ్లు చెమటోడ్చినప్పటికీ అందివచ్చిన అవకాశాల్ని గోల్‌గా మలచలేకపోయారు.
ఎట్టకేలకు ఆట 26వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ ‘డి’ సర్కిల్ కుడివైపు నుంచి కొట్టిన షాట్ ప్రత్యర్థి ఆటగాళ్లను బోల్తాకొట్టిస్తూ గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. దీంతో భారత్ 1–0తో ఆధిక్యాన్ని పొందినప్పటికీ నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఈ స్కోరు 1–1తో సమమైంది. ఆట 30వ నిమిషంలో జెరెమీ హేవర్డ్ ఇచ్చిన లాంగ్‌పాస్‌ను ఒకెండెన్ చక్కని షాట్‌తో గోల్‌గా మలిచాడు. దీంతో రెండో క్వార్టర్ 1–1తో ముగిసింది. ఇక తర్వాతి మూడు, నాలుగు క్వార్టర్లలో భారత ఆటగాళ్లకేదీ కలసిరాలేదు. టీమిండియా రక్షణ పంక్తిని ఛేదిస్తూ ఆస్ట్రేలియన్లు క్వార్టర్‌కు ఒకటి చొప్పున గోల్ చేయడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.
క్రెయిగ్ 34వ నిమిషంలో, విక్‌హమ్ 51వ నిమిషంలో చెరో గోల్ చేశారు. తొమ్మిది సార్లు అజ్లాన్ షా విజేత అయిన ఆసీస్ ప్రస్తుతం 7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లపై గెలుపొందిన భారత్ ఖాతాలో ఇప్పుడు 4 పాయింట్లున్నాయి. నేడు (బుధవారం) జరిగే పోరులో భారత్...జపాన్‌తో తలపడనుంది. మ్యాచ్ ఫలితంపై భారత కోచ్ ఓల్ట్‌మన్స్ మాట్లాడుతూ ‘అనుకున్న గేమ్‌ప్లాన్‌ను ఆచరణలో పెట్టలేకే జట్టు ఓడింది. మ్యాచ్‌లో తొలి గోల్‌తో ఆధిక్యంలోకి వచ్చేదాకా మావాళ్లు బాగానే ఆడారు. కానీ ఆ తర్వాతే ఆదమరిచారు. ఇదే మ్యాచ్‌ను మా నుంచి దూరం చేసింది’ అని అన్నారు.