బద్రీ గుర్తు చేశాడు.. బాదేశా: గేల్
బెంగళూరు: క్రికెట్ అభిమానులను అలరిస్తుంటూనే ఉంటానని వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ చెప్పాడు. టీ20ల్లో 10 వేల పరుగులు సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా నిలవడం పట్ల అతడు సంతోషం వ్యక్తం చేశాడు. గుజరాత్ లయన్స్ తో మంగళవారం బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అతడీ ఘనత సాధించాడు. గాయం కారణంగా డివిలియర్స్ ఆడడకపోవడంతో ఛాన్స్ దక్కించుకున్న గేల్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు బాదాడు.
‘పదివేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు 3 పరుగుల దూరంలో ఉన్నానని మ్యాచ్ కు ముందు శామ్యూల్ బద్రీ గుర్తు చేశాడు. కచ్చితంగా రికార్డు సృష్టిస్తావని చెప్పాడు. నాక్కూడా మనసులో అదే ఉంది. ఈ లక్ష్యం సాధించాలని పిచ్చిగా కోరుకున్నా. ఈ ఘనత సాధించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. టీ20ల్లో 10 వేల పరుగులు కొట్టిన తొలి బ్యాట్స్ మన్ గా నిలవడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన అభిమానుల, ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు. మున్ముందు కూడా నా ఆటతో అభిమానులకు అలరించేందుకు ప్రయత్నిస్తాన’ని క్రిస్ గేల్ చెప్పాడు. తనదైన శైలిలోనే ఆడతానని, భవిషత్తులో మరిన్ని వేల పరుగులు సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు.