చెన్నై: వన్డే వరల్డ్‌కప్-2019లో టీమిండియా కథ సెమీస్‌లోనే ముగిసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన నాకౌట్ పోరులో టీమిండియా ఓటమి పాలై మెగా టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 240 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. కాగా, ఎంఎస్ ధోని(50), రవీంద్ర జడేజా(77)లు పోరాట పటిమతో ఓ దశలో మ్యాచ్‌పై ఆసక్తి రేకెత్తింది. జడేజా, ధోని స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో మ్యాచ్ కివీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే ఆనాటి మ్యాచ్‌లో ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై విమర్శలు వచ్చాయి. ధోనిని ఇంకాస్త ముందు పంపితే ఫలితం వేరేగా ఉండేదనే వాదన వచ్చింది.
దీనిపై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రికి తాజాగా ఒక ప్రశ్నకు ఎదురుకాగా, ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం ఎంతమాత్రం తప్పుకాదన్నాడు. తమ నిర్ణయం సరైనదని సమర్థించుకున్నాడు. ‘ ఈ విషయంపై నేను ఎవరితోనైనా చర్చకు సిద్ధం. ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో ధోనిని బ్యాటింగ్‌కు పంపడం సరైనది కాదు. ఒకవేళ అలా చేసి ఉంటే మ్యాచ్ కడవరకూ వచ్చేది కాదు. ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంతో మనం ప్రత్యర్థికి సవాల్ విసిరాం. దీనిపై ఎవరు వాదనకు దిగినా అందుకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ధోని బలం ఏమిటో మనకు తెలుసు. ధోని ఒక మ్యాచ్ ఫినిషర్. అటువంటప్పుడు టాపార్డర్‌లో పంపలేం. ఇంకా సుమారు 10 బంతులు ఉండగా ధోని రనౌట్ అయ్యాడు. విజయానికి 20 పరుగులు అవసరమైన సమయంలో 10 బంతులు ఉండి ధోని క్రీజ్‌లో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది. రెండు బంతుల్ని సిక్స్‌లుగా కొట్టాడంటే ఇంకా ఎనిమిది బంతుల్లో ఎనిమిది పరుగులు చేయాల్సి ఉండేది. కానీ ధోని ఔట్ కావడంతో విజయం చేజారింది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment