రవిశాస్త్రి, విరాట్ కోహ్లి
ముంబై : టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లికి ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. ఎన్నో వేదికలపై వారు ఈ విషయాన్ని స్పష్టం చేశారు కూడా. తాజాగా మరోసారి కోహ్లిపై రవిశాస్త్రి ప్రశంసలు కురిపిస్తూ అభిమానాన్ని చాటుకున్నాడు. ‘లోక్‌మత్ మహారాష్ట్రీయన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్- 2018’ లో రవిశాస్త్రి తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ‘మహారాష్ట్ర అభిమాన్’ అవార్డు స్వీకరించిన ఈ మాజీ ఆల్‌రౌండర్... ‘పరుగుల వరద పారిస్తూ టీమిండియాకు విజయాలు అందిస్తున్న కోహ్లీని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. మా ఇద్దరిదీ దూకుడు స్వభావమే. ప్రత్యర్థి జట్టు సభ్యులపై ఒత్తిడి తెచ్చి విజయావకాశాలు మెరుగుపరుచుకుంటాం. మా ఇద్దరి మైండ్ సెట్ ఒకటే’ అని వ్యాఖ్యానించారు.
మాజీ కెప్టెన్ ధోని గురించి కూడా ప్రస్తావిస్తూ.. ‘అతనో లెజెండరీ ఆటగాడు. సిక్సర్ కొట్టి వరల్డ్ కప్ అందించిన క్షణంలో, డకౌట్‌గా తిరిగొచ్చిన సమయంలోనూ అతను కూల్‌గానే ఉంటాడు. మీడియాలో వస్తున్నట్టు ధోనీ, కోహ్లిల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. వారిరువురు ఒకరినొకరు గౌరవించుకుంటారు. మైదానంలో ధోని సలహాలను కోహ్లి పాటిస్తాడు. వారిద్దరి మధ్య ఉన్న అవగాహన వల్లే ఎన్నోసార్లు జట్టు విజయం సాధించిందని’ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment