ముంబై: డిపెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో ఇప్పటివరకు హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న సీఎస్‌కేను ముంబై ఇండియన్స్ అడ్డుకుంది. బుధవారం స్థానిక వాంఖెడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై 37 పరుగుల తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే.. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 133 పరుగులకు పరిమితమైంది. కేదార్ జాదవ్(58) మినహా ఎవరూ రాణించలేకపోయారు. దీంతో డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించాలనుకున్న సీఎస్‌కేకు భంగపాటు తప్పలేదు. ముంబై బౌలర్లలో మలింగ, హార్దిక్ పాండ్యాలు చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. బెహ్రన్‌డార్ఫ్ రెండు వికెట్లు తీశాడు.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. డికాక్(4) త్వరగానే వెనుదిరిగాడు. ఇక కుదురుకున్నాడనుకున్న తరుణంలో రోహిత్(13) కూడా జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన యువరాజ్(4) తీవ్రంగా నిరాశ పరిచాడు. దీంతో 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబైను సూర్యకుమార్(59), కృనాల్(42)లు ఆదుకున్నారు. చివర్లో హార్దిక్ పాండ్యా(25; 8 బంతుల్లో 1 ఫోరు, 3 సిక్సర్లు), పొలార్డ్(17; 7 బంతుల్లో 2 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో చహర్, మోహిత్, తాహీర్, జడేజా, బ్రేవోలు తలో వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment