మనకూ ఉన్నారు! | IPL 7: Demoralised Sunrisers Hyderabad Face Tough Battle Against Kolkata Knight Riders | Sakshi
Sakshi News home page

మనకూ ఉన్నారు!

Published Sun, May 18 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM

మనకూ ఉన్నారు!

మనకూ ఉన్నారు!

భారత క్రికెట్‌కు పేస్ విభాగం ఎప్పుడూ సమస్యే. ఇటీవల కాలంలో వస్తూ పోతున్న బౌలర్లతో ఈ విభాగంలో నిలకడలేమి ధోనికి పెద్ద సమస్యగా మారింది. అయితే కీలక ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఈ సీజన్ ఐపీఎల్ భారత కెప్టెన్‌కు కాస్త ఊరటనిచ్చింది. ఏకంగా నలుగురు భారత పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటం ఇంగ్లండ్ పర్యటనకు ముందు స్థైర్యాన్ని పెంచనుంది.
 
 సాక్షి క్రీడా విభాగం
 సాధారణంగా ఐపీఎల్‌లో ప్రతిసారీ విదేశీ బౌలర్లదే హవా. ముఖ్యంగా పేసర్ల విషయంలో భారత క్రికెటర్లు వికెట్ల జాబితాలో ఎక్కడో ఉండేవారు. కానీ ఈసారి సీన్ మారింది. వికెట్ల జాబితాలో టాప్-10లో ఏకంగా నలుగురు పేసర్లు ఉన్నారు.
 
 వీరిలో భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ తమ స్వింగ్‌తో సంచలన ఫలితాలు సాధిస్తుంటే... మోహిత్ శర్మ కొత్తగా ‘స్లో’ బంతులతో బ్యాట్స్‌మెన్‌ను అయోమయంలోకి నెడుతున్నాడు. ఇక భారత్‌లో ప్రస్తుతం ఉన్న పేసర్లలో నిలకడగా గంటకు 140కి.మీ.తో బంతులు వేయగల బౌలర్ వరుణ్ ఆరోన్. తను కూడా ఈ సీజన్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒక రకంగా ఇది భారత క్రికెట్‌లో ఉత్సాహాన్ని పెంచే అంశం. ఈ సీజన్‌లో ఈ నలుగురు బౌలర్ల ప్రదర్శనను గమనిస్తే...
 
 భువనేశ్వర్ కుమార్
 భారత పేసర్ల గురించి చర్చ వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది హైదరాబాద్ సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గురించే. ఈ సీజన్‌లో తన బౌలింగ్‌తో అద్భుతాలు చేస్తున్నాడు. రెండేళ్ల కిందట భారత జట్టులో చోటు సంపాదించిన భువనేశ్వర్ కొత్త బంతితో అద్భుతంగా స్వింగ్ చేస్తూ ఫలితాలు రాబట్టాడు. అయితే డెత్ ఓవర్లలో మాత్రం చాలా బలహీనం. కానీ ఈ యూపీ బౌలర్ లోపాలను సరిదిద్దుకుని చక్కగా రాణిస్తున్నాడు.

ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్ లెంగ్త్ బంతులు విసురుతూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ముకుతాడు వేస్తున్నాడు. ఐపీఎల్‌లో కీలకమైన సమయాల్లో వికెట్లు పడగొడుతూ హైదరాబాద్ సన్‌రైజర్స్‌కు విజయాలు అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఏడో సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసుకున్నాడు. అహ్మదాబాద్‌లో రాజస్థాన్‌పై (4 వికెట్లు), షార్జాలో పంజాబ్‌పై (3 వికెట్లు) రాణించాడు. కొత్త బంతితో తన బలం స్వింగ్‌ను ఉపయోగించి అద్భుతాలు చేస్తున్న భువీ... డెత్ ఓవర్లలో మెరుగైన బంతులు వేస్తుండటం ఈ ఐపీఎల్ ద్వారా తనకు జరిగిన పెద్ద మేలు.
 
 మోహిత్ శర్మ
 ఐపీఎల్‌లో భారత క్రికెటర్లలో భువనేశ్వర్ తర్వాత ఆ స్థాయిలో బౌలింగ్ చేస్తున్న బౌలర్ మోహిత్ శర్మ. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మోహిత్ గత ఏడాదీ ఐపీఎల్‌లో బరిలోకి దిగాడు. 2013లో 15 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసుకున్నాడు. పరుగుల హోరులో ఎవరూ అతని ప్రతిభను గుర్తించలేదు. ఈ సీజన్ ఆరంభంలో మోహిత్ గురించి పెద్దగా తెలియకపోయినా... అద్భుత బౌలింగ్ నైపుణ్యంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు. అతను వేసే బంతుల్లో వేగం లేకపోయినా.. బ్యాట్స్‌మెన్‌ను చక్కటి బౌలింగ్‌తో ఇబ్బంది పెడుతున్నాడు.
 
 బెన్ హిల్ఫెనాస్ లాంటి బౌలర్ జట్టులో ఉన్నా.. ప్రధాన బౌలర్‌గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. స్లో బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తున్నాడు. సీజన్‌లో కెవిన్ పీటర్సన్, ఆరోన్ ఫించ్, కీరన్ పొలార్డ్ లాంటి హిట్టర్లను సైతం బోల్తా కొట్టించాడు. ఇక మోహిత్ డెత్ ఓవర్లలోనూ స్లో బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన మోహిత్ 18 వికెట్లు తీశాడు. మోహిత్ ఇదే నిలకడైన బౌలింగ్ ప్రదర్శనను కొనసాగిస్తే కీలక బౌలర్‌గా ఎదిగే అవకాశాలున్నాయి.
 
 సందీప్ శర్మ
 ఐపీఎల్ ఏడో సీజన్‌లో అనూహ్యంగా తెరమీదకు వచ్చిన బౌలర్ సందీప్ శర్మ. ఓ వైపు పంజాబ్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లతో అదరగొడుతుంటే... 20 ఏళ్ల సందీప్ ఐపీఎల్‌లో తన  స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి జోరుకు బ్రేకులు వేస్తున్నాడు. 2010, 2012 అండర్-19 ప్రపంచకప్‌లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన సందీప్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కారణంగా పంజాబ్ తరఫున ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను 8 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. స్వింగ్‌తో బెంబేలెత్తిస్తున్న ఈ యువ బౌలర్ వేగంపైనా దృష్టి పెట్టాడు. గత ఏడాది 125 కి.మీ వేగంతో బంతులు విసిరిన సందీప్ శర్మ ప్రస్తుతం నిలకడగా 130 కి.మీ. వేగంతో బంతులు సంధిస్తున్నాడు.  ప్రస్తుతం భారత జట్టులో  భువనేశ్వర్ ఉన్నందున సందీప్‌కు వెంటనే అవకాశం రాకపోచ్చు. అయితే ఒక ప్రత్యామ్నాయం మాత్రం దొరికింది.
 
 వరుణ్ ఆరోన్
 భారత స్పీడ్ స్టర్ వరుణ్ ఆరోన్ ఐపీఎల్ ఏడో సీజన్‌లో సత్తా చాటుతున్నాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున బరిలో ఉన్న 24 ఏళ్ల ఆరోన్  ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో 8 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసుకున్నాడు. కొన్నాళ్లుగా గాయాలతో సహవాసం చేసిన ఆరోన్ నిలకడైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. త్వరలో ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో ఆరోన్ ప్రదర్శన భారత బౌలింగ్ లైనప్‌ను పటిష్టంగా మార్చే అవకాశం ఉంది. అయితే తరచూ గాయాలబారిన పడటం తనకున్న పెద్ద సమస్య. ఇదే తన కెరీర్‌కు పెద్ద ప్రతిబంధకం. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే ఆరోన్ భారత్‌కు ప్రధాన బౌలర్‌గా ఎదిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement