వైస్ కెప్టెన్ రేసులో వాళ్లిద్దరు?
- టెస్టు వైస్ కెప్టెన్సీపై చర్చ
- అనుభవం కంటే సమర్థతకే అవకాశం
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి నాయకుడిగా బాధ్యతలు చేపట్టడంతో ఇప్పుడు భారత టెస్టు వైస్ కెప్టెన్సీపై చర్చ మొదలైంది. ఆస్ట్రేలియాలో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అజింక్య రహానేతో పాటు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లు ఇందు కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి వైస్ కెప్టెన్ ఎంపికలో కీలకం కానున్నారు. ఆయన ఆటగాళ్ల గురించి ఏం చెబుతారన్నది కీలకం. దీనిపై సెలక్షన్ కమిటీ ఆలోచనలేమిటో ఇప్పుడే చెప్పలేం. అయితే ప్రస్తుతానికి రహానే, అశ్విన్‌లలో ఒకరికి ఆ చాన్స్ ఉంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
అశ్విన్ ఇప్పటివరకు తన కెరీర్‌లో 23 టెస్టులు ఆడాడు. అయితే ఇటీవల చాలా సందర్భాల్లో టెస్టు తుది జట్టులో కూడా అతనికి చోటు దక్కలేదు. మరో వైపు మూడు ఫార్మాట్‌లలో కూడా ఇప్పుడు రహానే రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. బ్యాటింగ్‌లో ఇప్పటికే తనను తాను రుజువు చేసుకున్నాడు.
దూకుడైన కోహ్లి, ప్రశాంత చిత్తం ఉన్న రహానే సరిజోడిగా ఉంటారనేది ఒక అభిప్రాయం. మరో వైపు సొంతగడ్డపై సిరీస్‌లకు వైస్‌కెప్టెన్‌ను నియమించవద్దని బీసీసీఐ గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ తర్వాత మాత్రమే భారత్, బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది కాబట్టి వైస్ కెప్టెన్సీ ఎంపికకు కూడా చాలా సమయం ఉందని చెప్పవచ్చు.
ఇషాంత్ ఎంపికయ్యాడా!
మరోవైపు ఇషాంత్‌ను ఎంపిక చేసినట్లు భువనేశ్వర్ తన ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్య ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు వైస్ కెప్టెన్సీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే భువీ మాత్రం కంగ్రాట్స్ చెప్పేశాడు. ‘భారత టెస్టు జట్టు వైస్‌కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన ఇషాంత్ శర్మకు నా అభినందలు’ అని ఇందులో అతను వ్యాఖ్యానించాడు.