జింబాబ్వేపై గెలిచాక ధోనీ ఏం చేశాడు..?
హరారే: జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ను 3-0 తో క్లీన్స్వీప్ చేసిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని యువ సేన రిలాక్స్ అయింది. మూడో వన్డే ముగిసిన అనంతరం కొన్ని రోజుల నుంచి తీవ్ర ఒత్తిడిలో ఉన్న మహీ మళ్లీ మిస్టర్ కూల్ గా కనిపించాడు. మహీ చిన్న పిల్లాడిలా మారిపోయి యువ ఆటగాళ్లతో పోటీపడి గేమ్ లో పాల్గొన్నాడు. యువ ఆటగాళ్లతో సరదాగా గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేశాడు. భారత పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని యువ ఆటగాళ్లతో కలసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు. అయితే మైదానంలో దికి ధోనీ దూకుడు ప్రదర్శించాడని మాత్రం భావించవద్దు. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి వీడియో గేమ్ ఆడారు.
స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా అంటూ తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. ఫుట్ బాల్ జట్లు స్పెయిన్, అర్జెంటీనా అంటూ విడిపోయి ధోని, ఉనద్కత్, కరుణ్ నాయర్, మన్‌దీప్ సింగ్‌లు వీడియో గేమ్ ఆడుతున్నట్లు మహీ పోస్ట్ చేసిన ఫొటోలో కనిపిస్తున్నారు. అక్షర్ పటేల్ మాత్రం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్కు రెట్టించిన ధోనీ సేన రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం సాయంత్రం గం.4.30ని.లకు హరారే స్పోర్ట్ క్లబ్ స్టేడియంలో తొలి టీ 20 ప్రారంభం కానుంది.