న్యూఢిల్లీ: ఒక్క మ్యాచ్.. లక్ష ఉద్వేగాల సంగమం. అసలైన టీ20 మజా ఎలా ఉంటుందో రుచి చూపించిన మ్యాచ్. తీవ్రమైన ఉత్కంఠ.. బంతి బంతికి మారుతున్న సమీకరణలు. హోరాహోరీగా గెలుపుకోసం ఇరుజట్ల ప్రయత్నం. మ్యాచ్‌ను చూస్తున్న ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. అది 2007, సెప్టెంబర్ 24వ తేదీన భారత-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ ట్వంటీ 20 ఫైనల్ మ్యాచ్ . ఆ మ్యాచ్ జరిగి సరిగ్గా నేటికి పదేళ్లు పూర్తయింది. ఆ మ్యాచ్ లో భారత జట్టు ఐదు పరుగుల తేడాతో గెలిచి వరల్డ్ ట్వంటీ 20 కప్ ను అందుకుంది. ఆ క్రమంలోనే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరు కూడా మార్మోగిపోయింది.
అయితే ఆనాటి ఫైనల్ ఓవర్ ను వేసిన జోగిందర్ శర్మ అప్పటి ఉద్వేగక్షణాల్ని మరొకసారి గుర్తు చేసుకున్నాడు.'ధోని నా వద్దకు వచ్చి బంతిని అప్పగించాడు. మేము గెలవాలంటే వికెట్ తీస్తే చాలు. పాకిస్తాన్ గెలవాలంటే 13 పరుగులు కావాలి. ఇదే విషయాన్ని నాకు బంతిని అప్పగించే క్రమంలో ధోని చెప్పాడు. నన్ను ఎటువంటి ఒత్తిడి లోనుకాకుండా బౌలింగ్ చేయమన్నాడు. ఒకవేళ ఓడిపోతే ఆ బాధ్యతను నేను తీసుకుంటానని ధోని అన్నాడు. దాంతో నాపై ఉన్న భారం దిగినట్లు అనిపించింది. ఇక ఎటువంటి ఆందోళన లేకుండా బౌలింగ్ చేయడానికి సిద్ద పడ్డా'అని అప్పటి జ్ఞాపకాల్ని జోగిందర్ శర్మ నెమరువేసుకున్నాడు.
పాకిస్తాన్‌తో ఫైనల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు గంభీర్ (75) ప్రదర్శనతో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. పాకిస్తాన్ మాత్రం 19.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ కావడంతో 5 పరుగులతో విజయం సాధించిన ధోని సేన కప్‌ను ముద్దాడింది. మిస్బావుల్ హక్ చివరి వరకు ప్రమాదకరంగా కనిపించినా... అతని ఒక్క షాట్‌తో పాక్ తలరాత మారిపోయింది. ఆఖరి ఓవర్లో పాక్ విజయానికి 13 పరుగులు అవసరం. సీనియర్ హర్భజన్ సింగ్‌ను కాదని పేసర్ జోగీందర్ శర్మపై కెప్టెన్ ధోని నమ్మకముంచాడు. ‘ఎవరూ నీ మ్యాచ్‌లు చూడని సమయంలో దేశవాళీ క్రికెట్‌లో అంకితభావంతో ఎన్నో ఓవర్లు వేసి ఉంటావు. భయపడకు, క్రికెట్ ఈసారి నిన్ను నిరాశపర్చదు’... ఇవీ జోగీందర్‌కు ఆ సమయంలో ధోని చెప్పిన మాటలు. అయితే మిస్బా సిక్సర్ బాదడంతో తొలి 2 బంతుల్లో 7 పరుగులు వచ్చాయి. మరో 4 బంతుల్లో 6 పరుగులు చేస్తే చాలు. అయితే మూడో బంతిని స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో మిస్బా గాల్లోకి లేపడం... షార్ట్ ఫైన్ లెగ్‌లో శ్రీశాంత్ క్యాచ్ పట్టుకోవడం అంతా కలలా జరిగిపోయింది. అంతే... భారత్ సంబరాలకు అంతు లేకుండా పోయింది.