రయ్... రయ్... రోస్‌బర్గ్
మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
సీజన్‌లో రెండో విజయం
మెర్సిడెస్‌వే తొలి రెండు స్థానాలు
ఏకంగా 8 మంది డ్రైవర్లు అవుట్
మోంటెకార్లో: గత పదేళ్లలో తొమ్మిదిసార్లు మొనాకో గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన డ్రైవర్‌కే టైటిల్ లభించింది. ఈ ఏడాదీ ఆ సెంటిమెంట్ పనిచేసింది. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచాడు.
సహచర డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నుంచి గట్టిపోటీ లభించినా... ఎక్కడా నియంత్రణ కోల్పోకుండా డ్రైవ్ చేసిన రోస్‌బర్గ్ వరుసగా రెండో ఏడాది మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. మోంటెకార్లో నగర వీధుల్లో జరిగిన ఈ 78 ల్యాప్‌ల రేసును రోస్‌బర్గ్ గంటా 49 నిమిషాల 27.661 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. గత నాలుగు రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్ ఈసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రేసు ఆరంభ క్షణాల్లోనే ఆధిక్యంలోకి వెళ్లిన రోస్‌బర్గ్ చివరివరకూ తన జోరును కొనసాగించాడు.
ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఆరు రేసుల్లోనూ మెర్సిడెస్ డ్రైవర్లకే టైటిల్ లభించడం విశేషం. అంతేకాకుండా ఫార్ములావన్ చరిత్రలో ఒక సీజన్‌లో ఆరంభ ఆరు రేసుల్లో టైటిల్ నెగ్గిన రెండో జట్టుగా మెర్సిడెస్ గుర్తింపు పొందింది. 1988లో మెక్‌లారెన్ జట్టు సీజన్‌లో వరుసగా 11 రేసుల్లో గెలిచింది.
డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్‌కు ఈ రేసు నిరాశను మిగిల్చింది. కారులో సాంకేతిక సమస్య ఏర్పడటంతో వెటెల్ ఎనిమిదో ల్యాప్‌లోనే రేసు నుంచి తప్పుకున్నాడు. వెటెల్‌తోపాటు మరో ఏడుగురు డ్రైవర్లు (మల్డొనాడో, సుటిల్, క్వియాట్, వెర్జెన్, బొటాస్, పెరెజ్, గుటిరెజ్) రేసును పూర్తి చేయకపోవడం గమనార్హం.
భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు ఈ రేసు మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానంలో నిలిచి 10 పాయింట్లు సంపాదించగా... సెర్గియో పెరెజ్ రేసు తొలి ల్యాప్‌లోనే వెనుదిరిగాడు. తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 8న జరుగుతుంది.