పేస్‌ టు పేస్‌ | The original goal was the Test series win for the first time | Sakshi
Sakshi News home page

పేస్‌ టు పేస్‌

Published Fri, Dec 14 2018 2:58 AM | Last Updated on Fri, Dec 14 2018 3:02 AM

The original goal was the Test series win for the first time - Sakshi

అసలు లక్ష్యం... తొలిసారి టెస్టు సిరీస్‌ విజయం! అందులో భాగంగా మొదటి మ్యాచ్‌ను నెగ్గి 71 ఏళ్ల చరిత్రను తిరగరాశారు! ఇప్పుడు... వరుసగా రెండో టెస్టునూ గెలిచి 41 ఏళ్ల నాటి రికార్డును సమం చేసే అరుదైన అవకాశం టీమిండియా ముందుంది. దానిని అందుకునేందుకు పచ్చని పచ్చిక పిచ్‌ స్వాగతం పలుకుతోంది. అడిలైడ్‌ ఆధిక్యాన్ని నిలుపుకొంటూ... దీటైన పేస్‌ దళంతో ఈ సవాల్‌నూ ఛేదిస్తామంటోంది కోహ్లి సేన. సొంతగడ్డపై తిరిగి పుంజుకునే ప్రయత్నంలో ఉంది ఆస్ట్రేలియా. మరి... ఇందులో పైచేయి
ఎవరిదో?  

పెర్త్‌: కంగారూ గడ్డపై 1977–78 సిరీస్‌లో వరుసగా రెండు టెస్టులు గెలిచింది టీమిండియా. అనంతరం పలుసార్లు పర్యటించినా, మూడు మ్యాచ్‌లు నెగ్గినా, దీనిని పునరావృతం చేయలేకపోయింది. శుక్రవారం నుంచి పెర్త్‌లో జరుగనున్న రెండో టెస్టు ద్వారా ఆ గొప్పనూ చేరేందుకు అడుగు దూరంలో ఉంది భారత్‌. పేస్‌కు పుట్టిల్లులాంటి ‘వాకా’ స్టేడియంలో కాకుండా కొత్త మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. వేదిక మారినా... ప్రపంచంలో వేగవంతమైనదిగా పేరుగాంచిన పిచ్‌ స్వరూపంలో మాత్రం తేడా ఉండబోవడం లేదు. మరోవైపు బ్యాట్స్‌మన్‌ రోహిత్‌శర్మ, స్పిన్నర్‌ అశ్విన్‌ గాయపడటంతో కోహ్లి సేన ఈ టెస్టుకు రెండు మార్పులతో బరిలో దిగనుంది. గురు వారం 13 మందితో జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా అడిలైడ్‌లో ఆడిన జట్టునే కొనసాగించనుంది. 
మార్పు తప్పలేదు... 
స్టార్‌ బ్యాట్స్‌మన్, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రాణించకున్నా తాము మ్యాచ్‌ను గెలవగలమని అడిలైడ్‌లో నిరూపించింది భారత్‌. సిరీస్‌ ప్రారంభంలోనే జట్టుకు అమితమైన ఆత్మవిశ్వాసం ఇచ్చింది వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే సైతం కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చారు. పెర్త్‌లో రాణించాల్సిన బాధ్యత కోహ్లిపై ఉంది. అతడు ఊపందుకుంటే జట్టుకు తిరుగుండదు. యువ సంచలనం పృథ్వీ షా ఇంకా కోలుకోనందున మురళీ విజయ్, కేఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నారు. అయితే, తొలి టెస్టులో ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన రోహిత్, ఉదర కండరాల నొప్పితో అశ్విన్‌ రెండో టెస్టుకు దూరమయ్యారు. దీంతో హనుమ విహారి, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ పేర్లను చేర్చారు. వీరిలో రోహిత్‌ బదులుగా ఆరో స్థానంలో విహారి ఆడటం ఖాయం కాగా... జడేజా, భువీలలో ఒకరికే అవకాశం దక్కనుంది. పేస్‌కు స్వర్గధామమైన పిచ్‌ కావడంతో పాటు, ఆస్ట్రేలియా జట్టులో ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా ఉన్నందున జడేజా కంటే భువీని ఆడించడమే సరైన కూర్పుగా కనిపిస్తోంది. 

ఆసీస్‌.. అదే జట్టుతో 
బ్యాటింగ్‌లో విఫలమైనా, బౌలర్లు ఆకట్టుకోకున్నా అదే జట్టుతో రెండో టెస్టు ఆడబోతోంది ఆస్ట్రేలియా. పిచ్‌ ఎలా ఉన్నా... ముగ్గురు పేసర్లకు తోడు స్పిన్నర్‌ లయన్‌పై విశ్వాసం ఉంచింది. దీంతో ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్‌‡్ష బెంచ్‌కే పరిమితమయ్యాడు. నిలకడ చూపే ఖాజాకు తోడు ఓపెనర్లు మార్కస్‌ హారిస్, అరోన్‌ ఫించ్‌ల నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌ కోరుకుంటోంది. అడిలైడ్‌లో అర్ధశతకాలు సాధించి షాన్‌ మార్‌‡్ష, ట్రావిస్‌ హెడ్‌ ఫర్వాలేదనిపించారు. హ్యాండ్స్‌కోంబ్, కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ మరింత మెరుగ్గా ఆడితేనే జట్టు పోటీలో నిలుస్తుంది. అన్నింటికంటే ఆసీస్‌ను ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది... ప్రధాన బౌలర్‌ మిషెల్‌ స్టార్క్‌ వైఫల్యం. తొలి టెస్టులో అతడు ఐదు వికెట్లు పడగొట్టినా అవేవీ సరైన సమయంలో తీసినవి కాదు. హాజల్‌వుడ్‌ కూడా తేలిపోయాడు. దీంతో భారమంతా కమిన్స్, లయన్‌పైనే పడింది. పెర్త్‌లాంటి చోట స్టార్క్‌ చెలరేగితే భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టొచ్చని భావిస్తోంది. 

ఇది ‘వాకా’ కాదు 
పెర్త్‌ అంటే ‘వాకా’ అని, ప్రపంచంలోనే వేగవంతమైన పిచ్‌ అని క్రికెట్‌ అభిమానులను ఎవరిని అడిగినా చెబుతారు. ఐదు దశాబ్దాలుగా ఈ ముద్ర పడిపోయింది. శుక్రవారం నుంచి జరుగనున్న టెస్టుకు పెర్త్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. స్వాన్‌ నది ఒడ్డున నిర్మించిన ఈ మైదానంలో ఇప్పటివరకు రెండు వన్డేలు జరిగాయి. టెస్టు ఆడనుండటం ఇదే మొదటిసారి. 

పేస్‌తోనే పడగొడదామని... 
ఒక్క స్పిన్నరూ లేకుండా టీమిండియా ఈ ఏడాది జనవరిలో జొహన్నెస్‌బర్గ్‌ టెస్టులో ఆడింది. ఆ మ్యాచ్‌లో నలుగురు ప్రధాన పేసర్లతో పాటు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకూ చోటిచ్చింది. పెర్త్‌లోనూ మరోసారి అదే ఫార్ములాను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. జట్టు వ్యూహం మారి చివరి నిమిషంలో జడేజాను తీసుకుంటే తప్ప భువీ తుది 11 మందిలో ఉండే అవకాశమే కనిపిస్తోంది. ఈ ప్రకారం ఇషాంత్, షమీ, బుమ్రాలతో పాటు భువీ కూడా బరిలో ఉంటే... అసలే అంతంతమాత్రం బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ఆస్ట్రేలియాకు ఇక్కట్లు తప్పవు. చిత్రమేమంటే... మిషెల్‌ మార్‌ షలాంటి పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఉన్నా ఆతిథ్య జట్టు మాత్రం ముగ్గురు పేసర్లతో ఆడబోతోంది. దీంతో పెర్త్‌ పిచ్‌ పూర్తిగా పేస్‌కు అనుకూలమేనా అనే సందేహం తలెత్తుతోంది.

భయపడే రోజులు పోయాయి... 
ఇలాంటి జీవం ఉన్న పిచ్‌లను చూసి ఆందోళన చెందడం లేదు. మేం కూడా ఈ సవాల్‌ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. పిచ్‌పై ఇంతకుమించి పచ్చికను తొలగించరని అనుకుంటున్నాం. మాకిదేం కొత్త కాదు. జొహన్నెస్‌బర్గ్‌లాంటి చోట ఆడాం. ప్రత్యర్థిని కుప్పకూల్చే పేస్‌ బలం కారణంగా మరింత ఉత్సాహంగా ఉన్నాం. సమష్టిగా, సానుకూల దృక్పథంతో బ్యాటింగ్‌ చేసి బౌలర్లలో స్ఫూర్తి నింపుతాం. మా ఐదుగురు పేసర్ల ఎదుగుదలలో నా పాత్రేమీ లేకపోయినా వారంతా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సమయంలో నేను కెప్టెన్‌గా ఉండటం నా అదృష్టం. 
– టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

తుది జట్ల వివరాలు
భారత్‌: విజయ్, రాహుల్, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానే, విహారి, పంత్, బుమ్రా, షమీ, ఇషాంత్, జడేజా/భువనేశ్వర్‌/ఉమేశ్‌. 
ఆస్ట్రేలియా: హారిస్, ఫించ్, ఖాజా, షాన్‌ మార్‌‡్ష, హ్యాండ్స్‌కోంబ్, హెడ్, పైన్‌ (కెప్టెన్‌), స్టార్క్, కమిన్స్,లయన్, హాజల్‌వుడ్‌ 

పిచ్, వాతావరణం
వేగవంతమైన పిచ్‌ కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గుచూపొచ్చు. 36 డిగ్రీల ఎండతో వాతావరణం పొడిగా ఉంది. వర్ష సూచనలు లేవు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement