భారత జట్లకు క్లిష్టమైన ‘డ్రా’
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ టీమ్ పోటీల్లో భారత జట్లకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. అంచనాలకు అనుగుణంగా సమష్టిగా రాణిస్తే మహిళల జట్టు సెమీఫైనల్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే పురుషుల జట్టు మాత్రం తొలి రౌండ్ దాటడమే అనుమానంగా ఉంది. దక్షిణ కొరియాలోని ఇంచియోన్ నగరంలో ఈనెల 19 నుంచి అక్టోబరు 4 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. బ్యాడ్మింటన్ టీమ్ విభాగం ‘డ్రా’ వివరాల ప్రకారం... పురుషుల విభాగంలో భారత జట్టు తొలి రౌండ్‌లో ఆతిథ్య దక్షిణ కొరియాతో తలపడుతుంది.
భారత్ నెగ్గాలంటే మూడు సింగిల్స్ మ్యాచ్‌లపైనే ఆధారపడాలి. డబుల్స్‌లో కొరియాకు చెందిన మూడు జోడిలు టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఉన్నాయి. ఒకవేళ కొరియాను భారత్ ఓడిస్తే క్వార్టర్ ఫైనల్లో పటిష్టమైన జపాన్ ఎదురవుతుంది. ఇక మహిళల విభాగంలో భారత జట్టు తొలి రౌండ్‌లో మకావు జట్టుతో ఆడుతుంది. ఈ రౌండ్ దాటితే క్వార్టర్ ఫైనల్లో 2010 గ్వాంగ్‌జూ ఆసియా క్రీడల రన్నరప్ థాయ్‌లాండ్ ప్రత్యర్థిగా ఉంటుంది.
థాయ్‌లాండ్‌పై భారత్ నెగ్గాలంటే సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, సింధు తప్పనిసరిగా గెలవడంతోపాటు డబుల్స్‌లో జ్వాల-అశ్విని పొన్నప్ప జంట కూడా విజయం సాధించాలి. భారత మహిళల జట్టు విశేషంగా ఆడితే సెమీఫైనల్ చేరుకోవచ్చు. ఆసియా క్రీడల్లో టీమ్ విభాగంతోపాటు వ్యక్తిగత విభాగాలలో సెమీఫైనల్ చేరుకుంటే జట్లకు కాంస్య పతకాలు ఖాయమవుతాయి.