స్లెడ్జింగ్ లేకపోతే మజానే లేదు!
సిడ్నీ: స్లెడ్జింగ్ అనేది క్రికెట్ లో సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో స్లెడ్జింగ్ అనేది ఆటగాళ్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కూడా దారి తీస్తుంది. కాగా, స్లెడ్జింగ్ పై నియంత్రణ చర్యలు చేపట్టాలని ఇటీవల ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రికెట్ లో మజాను అందించే స్లెడ్జింగ్ ను నియంత్రించడం సబబు కాదని పేర్కొన్నాడు. ఒకవేళ పూర్తి స్థాయిలో స్లెడ్జింగ్ ను నియంత్రిస్తే మాత్రం ఆటలో ఆహ్లాదం హరించుకుపోతుందన్నాడు.
తాను గత 18 నెలల్లో రెండు సార్లు ఐసీసీ హెచ్చరికలకు గురైనట్లు వార్నర్ తెలిపాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన సిరీస్ తో పాటు ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన సందర్భంగా రోహిత్ శర్మను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడంతో తనకు ఇదే చివరి హెచ్చరిక అంటూ ఐసీసీ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. క్రికెట్ లో వికెట్లు పడిన సందర్భాల్లో ఫీల్డింగ్ టీమ్ సంబరాలు చేసూకుంటూ కొన్ని వ్యాఖ్యలు చేసుకోవడంలో తప్పేముందని వార్నర్ తాజాగా ప్రశ్నించాడు. అది ఆటలో ఓ భాగంగానే చూడాలన్నాడు.
ఇటీవల జరిగిన వరల్డ్ కప్ కు ముందు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్ సన్ నేతృత్వంలోని జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశంలో స్లెడ్జింగ్ విధానాన్ని నియంత్రించి ఆట స్వచ్ఛందంగా జరగాలని నిర్ణయం తీసుకున్నారు.